![కొడంగల్ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేయండి : ప్రతీక్ జైన్](https://static.v6velugu.com/uploads/2024/06/vikarabad-collector-prateek-jain-ordered-to-complete-tenders-for-development-works-of-kodangal-segment-immediately_XUWxPqF9dQ.jpg)
కొడంగల్, వెలుగు: కొడంగల్ సెగ్మెంట్ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ రోడ్ల విస్తరణకు ఇంజనీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ సెగ్మెంట్ అభివృద్ధికి ఏర్పాటైన కడా( కొడంగల్ ఏరియా డెవలప్మెంట్అథారిటీ) చేపట్టే పనులపై శుక్రవారం కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
మెడికల్, వెటర్నరీ, పారా మెడికల్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తి చేయాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొడంగల్ టౌన్ లో కొత్తగా నిర్మించే 220 పడకల ఆస్పత్రి బిల్డింగ్ కు నమూనాలను రెడీ చేయాలని, వైద్యుల నియామకానికి ప్రతిపాదనలు అందించాలని స్పష్టంచేశారు. కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ చంద్రప్రియ, అధికారులు ఉన్నారు.
స్కూళ్లలో వాడని ఫర్నిచర్ తొలగించాలి
పాఠశాలల్లో పాడైపోయిన సామగ్రిని వారంలోగా తీసివేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, మిషన్ భగీరథ ఇంటింటి సర్వేపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ ఈఈలతో జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. పాఠశాలల్లో పాడైన ఫర్నిచర్, ఇతరాత్ర సామగ్రిని తొలగించి క్లీన్ గా ఉంచాలని సూచించారు.
ప్రహరీలు స్కూళ్లకు ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండొద్దని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, జడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఈవో రేణుకాదేవి తదితరులు ఉన్నారు.
ప్రజా పాలన అర్జీల్లో తప్పులు సరిచేసుకోండి
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఏవైనా సవరణలు చేసుకోదలిస్తే ప్రజా పాలన సేవ కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా పాలన సేవ కేంద్రాలను మండల కేంద్రాల్లోని ఎంపీడీవో ఆఫీసులు, టౌన్ లలో మున్సిపల్ ఆఫీసుల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.