ఇంటిగ్రేటెడ్ ​రెసిడెన్షియల్​ స్కూల్ ​పైలెట్​ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక:వికారాబాద్ ​కలెక్టర్

 ఇంటిగ్రేటెడ్ ​రెసిడెన్షియల్​ స్కూల్ ​పైలెట్​ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక:వికారాబాద్ ​కలెక్టర్

కొడంగల్/వికారాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​రెసిడెన్షియల్​స్కూల్​పైలెట్​ప్రాజెక్టుగా కొడంగల్​ను ఎంపిక చేసిందని వికారాబాద్​కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన కొడంగల్​లో పర్యటించి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్​కారణంగా ఆగిన పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీ, సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్, రోడ్లు, ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్ నిర్మాణ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. అనంతరం దౌల్తాబాద్ మండలంలోని దేవరఫస్లవాద్, గోకఫస్లవాద్ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. స్కూళ్లలో టాయిలెట్లు, డ్రింకింగ్​ వాటర్​లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. 

అమ్మ అదర్శ పాఠశాలల పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తనను కలిసేందుకు వచ్చే వారు బోకేలు, శాలువాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. వాటిని సర్కార్ బడుల విద్యార్థులకు పంపిణీ చేద్దామని చెప్పారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ వెంకట్​రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్​వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. జిల్లాలోని 1,107 అంగన్​వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మంజూరైన పనులను పూర్తి చేయాలని చెప్పారు. అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వెంకటేశ్వరమ్మ, ఎఫ్ఆర్ఓ వెంకటేశ్, సఖీ కేంద్రం అధికారి యశోద, బాలల పరిరక్షణ అధికారి ఆంజనేయులు, శిశుగృహ మేనేజర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.