
- శిక్ష విధించిన వికారాబాద్ జిల్లా కోర్టు
వికారాబాద్, వెలుగు : హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన ప్రకారం..కొత్తగడి గ్రామానికి చెందిన ముత్తారగాళ్ల మయూర్, సంగీత(48), దంపతులకు అదే ఊరికి చెందిన షేక్ పాషాతో పాత కక్షలు ఉన్నాయి.
2013లో మయూర్, సంగీత ఇద్దరూ కలిసి షేక్ పాషాను ఇటుకలతో కొట్టి చంపారు. అప్పటి సీఐ లచ్చిరాం నాయక్ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించారు.
అయితే, కేసు విచారణలో ఉండగానే మయూర్ చనిపోయాడు. బుధవారం కేసు విచారణలో భాగంగా సంగీతకు జీవిత ఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు జడ్జి సుదర్శన్ తీర్పునిచ్చారు.