వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతి కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి మృతిలో ఎన్నో అనుమానాలు తెరపైకొస్తున్నాయి. శిరీషను ఎవరైనా హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకుందా..? అని ఇంకా ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు రాలేదు. పోలీసుల విచారణలో అంతుచిక్కని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఇవే అనుమానాలు..
* యువతి కండ్లల్లో కర్ర లాంటిది గుచ్చుకుందని పోలీసులు చెబుతుండగా.. కండ్లల్లో ఉన్న రెండు గాయాలు కూడా ఒకే లోతులో ఉన్నాయని పోస్టుమార్టం చేసిన డాక్టర్ గుర్తించారు.
* ఒకవేళ నీటి కుంటలో దూకినప్పుడు గాయాలైతే శిరీష కంటి భాగంలో రక్తస్రావం జరిగి గడ్డ కట్టి ఎలా ఉంటుంది..? అనే అనుమానం తెరపైకొస్తోంది.
* మోకాలు లోతు ఉన్న నీళ్లు ఉన్న కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుంది..?
* బలవన్మరణానికి పాల్పడితే యువతి కడుపులో, ఊపిరితిత్తుల్లో నీరు ఎందుకు చేరలేదు..?
* రాత్రి 12-, లేదా ఒంటి గంట సమయంలో హత్య చేసి, తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో నీటిలో పడేసి ఉండొచ్చనే అనుమానాలు తెరపైకొస్తున్నాయి.
* హత్య జరిగిన తర్వాత మూడు గంటలు బయటే ఉంచి ఆ తర్వాత నీటిలో పడేసి ఉండవచ్చు..?
* పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
శిరీష ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కడ్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని.. ప్రశ్నిస్తున్నారు పోలీసులు. శిరీష అంత్యక్రియలు పూర్తయిన తర్వాత యువతి తండ్రి జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరీష కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. శిరీష మృతి చెందిన మరుసటిరోజు యువతి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం (జూన్ 10న) రాత్రి గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నట్లు యువతి బావ అనిల్ పోలీసులకు తెలిపాడు. ఉదయం ఫోన్ నుండి కాల్ వెళ్లినప్పటికీ తనకు ఫోన్ పాస్ వర్డు తెలియదంటూ పోలీసులతో అనిల్ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఫోన్ సీడీఆర్ ద్వారా యువతి కాల్ హిస్టరీ సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ కాల్ డాటా డిలీట్ కాకుండా సీడీఆర్ ద్వారా కాల్ హిస్టరీని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సమయం గడిస్తే శిరీష మృతి కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది.