రామేశ్వరం కేఫ్‌‌‌‌ బాంబు పేలుడు కేసులో వికారాబాద్‌‌‌‌ పండ్ల వ్యాపారి అరెస్ట్

రామేశ్వరం కేఫ్‌‌‌‌ బాంబు పేలుడు కేసులో వికారాబాద్‌‌‌‌ పండ్ల వ్యాపారి అరెస్ట్
  • నాలుగు రాష్ట్రాల్లో.. 11 ప్రాంతాల్లో ఎన్‌‌‌‌ఐఏ తనిఖీలు
  • ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇద్దరిని విచారించిన ఆఫీసర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌‌‌‌లో జరిగిన బాంబ్‌‌‌‌ బ్లాస్ట్‌‌‌‌ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌‌‌‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్‌‌‌‌ఐఏ బెంగళూరు బ్రాంచ్‌‌‌‌ అధికారులు మంగళవారం 4 రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా సహా కర్నాటక, తమిళనాడు, ఏపీలోని 11 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో  డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌‌‌‌ఐఏ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సోదాల్లో వికారాబాద్‌‌‌‌లో ఓ పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి స్వస్థలం పుణె కాగా, నాందేడ్‌‌‌‌లోనూ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. అతడు వికారాబాద్‌‌‌‌లో సాధారణ పండ్ల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇతడిపై కర్నాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు తెలిపారు. అలాగే, ఏపీలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో రిటైర్డ్‌‌‌‌ హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ తోపాటు అతని కొడుకు సోహెల్​ను ఎన్‌‌‌‌ఐఏ విచారించారు. సోహెల్‌‌‌‌ బెంగళూరులో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బాంబు పేలుడులోని నిందితులతో సోహెల్‌‌‌‌కు సంబంధాలున్నాయని, అతని బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్‌‌‌‌ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను కోల్‌‌‌‌కతాలో ఓ రహస్య ప్రదేశంలో ఏప్రిల్ 12న ఎన్‌‌‌‌ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.