మద్యం మత్తులో మహిళను హత్య చేసిన వ్యక్తి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి మద్యం మత్తులో తను సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. మహిళ గొంతుకు తాడు బిగించి హతమార్చాడు. రూఫ్ఖాన్ పేట గ్రామానికి చెందిన శ్యామలమ్మ, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన చంద్రమౌళిల మధ్య గత ఎనిమిదేళ్ళుగా సహజీవనం కొనసాగుతుంది. నిన్న రాత్రి వీరిద్దరూ గొడవపడ్డట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న చంద్రమౌళి అక్కడే తాడుతో మహిళ గొంతుకు బిగించి నులిమి హత్య చేశాడు. 

అనంతరం తనకేమీ తెలియనట్టు మహిళ తమ్ముడి ఇంటికి వెళ్ళి... మీ అక్క పలకడం లేదు అని చెప్పి అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేశాడు. మహిళ హత్య చేయబడినట్లు గుర్తించిన స్థానికులు..చంద్రమౌళిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. మద్యం మత్తులో హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.