రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భారీ వర్షాల కారణంగా తెగిపోయిన హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద హైవే రిపేర్లను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ఆర్అండ్ బీ, ట్రాన్స్పోర్ట్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు ఇబ్రహీం బాద్ వద్ద తెగిపోయిన హైవేను పరిశీలించారు.
రహదారి తెగిపోయి రాకపోకలు నిలిచిపోగా, హైవే అధికారులు రిపేర్ పనులు చేపట్టగా, వివరాలను హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే రిపేర్లు చేపట్టామని, రెండు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హైవే అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద జారీ చేసిన జీరో టికెట్లు, ఆదాయం వివరాలను ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చెక్ పోస్ట్ ద్వారా వస్తున్న రెవెన్యూ తదితర వివరాలపై ఆర్టీవోతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్ రావు, నేషనల్ హైవే ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఈలు నర్సింగం, ధర్మారెడ్డి, ఈఈ రెడ్డి రమేశ్ ఉన్నారు.
హన్వాడ: భారీ వర్షాలతో మహబూబ్‌నగర్–-తాండూరు హైవే కోతకు గురైంది. దీంతో రెండు రోజులుగా పరిగి, కొడంగల్, కోస్గి, తాండూరుకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోతకు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించడంతో సోమవారం ఆఫీసర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్ హైవేను పరిశీలించారు.