
చెన్నై: ప్రధాని మోడీ టార్గెట్‌గా ప్రముఖ తమిళ మీడియా గ్రూప్ వికటన్ తన వెబ్ సైట్లో పోస్టు చేసిన కార్టూన్ తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ మారింది. ఈ అంశంపై అధికార డీఎంకే, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని మోడీ కార్టూన్‌ను ప్రచురించారనే కారణంతో కేంద్రం వికటన్ వెబ్ సైట్‌ను బ్లాక్ చేయడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. వెంటనే వికటన్ వెబ్ సైట్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని అన్నారు.
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ కూడా దీనిపై స్పందించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను బీజేపీ అణివేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అయిన పత్రికా స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించాలని కోరారు. కంటెంట్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే.. దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కానీ.. పూర్తిగా వెబ్ సైట్‌ను బ్లాక్ చేయడం సరికాదన్నారు. వెంటనే వికటన్ వెబ్ సైట్‌ను పునరుద్ధరించి ప్రజాస్వామ్య స్వేచ్ఛను కాపాడాలన్నారు.
అధికార పార్టీ నేతల విమర్శలకు బీజేపీ నేతలు సైతం ధీటుగా బదులిస్తున్నారు. ఈ అంశంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందిస్తూ.. వికటన్ మీడియాపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార ప్రసార సహయ మంత్రి ఎల్ మురుగన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన కార్టూన్ పోస్ట్ చేసిన అధికార డీఎంకే పార్టీ కనుసన్నల్లో నడిచే వికటన్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
నకిలీ, పరువు నష్టం కలిగించే రచనలను ప్రచురించడం ద్వారా ఒక రాజకీయ నాయకుడిని అప్రతిష్టపాలు చేసే పత్రికా స్వేచ్ఛ వార్త పత్రికలకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని పేర్కొన్నారు. మరో తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలలో మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టు చేయబడిన వ్యక్తుల వివరాలను బయటపెట్టిన తర్వాత.. మీరు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడండని సీఎం స్టాలిన్‌కు సూచించారు.
కార్టూన్లో అసలేం ఉందంటే..?
ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివస్తోన్న భారతీయులను కూడా ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించారు. అయితే.. ఇండియాకు తరలించే క్రమంలో కాళ్లు, చేతులకు బేడీలు వేసి భారతీయులను దొంగలా మాదిరిగా అమెరికా వ్యవహారించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ అంశాన్ని ఆధారంగా తీసుకునే వికటన్ మీడియా గ్రూప్ ఒక వ్యంగ కార్టూన్ ముద్రించింది. ఈ కార్టూన్లో.. ప్రధాని మోడీ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయగా.. దీనిని చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతారు. భారతీయుల కాళ్లు, చేతులకు అమెరికా సంకెళ్లు వేసిన ట్రంప్ ముందు ప్రధాని మోడీ మౌనం వహించారని అర్థం వచ్చేలా ఈ కార్టూన్ ముద్రించారు. ఈ కార్టూన్ వైరల్‌గా మారడంతో వికటన్ వెబ్ సైట్‌ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. వికటన్ సైట్ బ్లాక్‌పై ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.