నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ లీడ్ రోల్స్‌లో ‘సర్వం శక్తిమయం’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. రామ్ తాళ్లూరి నిర్మించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఫస్ట్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇది. నవంబర్ 28 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రాజశేఖర్ ‘కల్కి’ ఫేమ్ తేజ దేశరాజ్ ఈ కథ రాశాడు. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక దర్శకుడిగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ ఇది. స్వాతంత్ర్యానికి ముందు తెలంగాణలోని అమరగిరి సంస్థానం నేపథ్యంలో జరిగే కథ.
1940ల్లో అక్కడ జరిగిన ఓ ఘటన, 1970లో పునరావృతం అవుతుందని, అది అమ్మోరు శాపమని అక్కడి ప్రజలు నమ్ముతారు. అది నిజంగా శాపమా, మరేదైనా కారణముందా.. ఆ సమస్యను డిటెక్టివ్ ఎలా పరిష్కరించాడు అనేది కథ. అప్పటి ప్రపంచాన్ని రీ క్రియేట్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. అదృష్టం కొద్దీ నాకు మంచి టీమ్ కుదిరింది. ఓ రాయల్ లుక్‌తో కథ చెబుతూనే థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించాం. తెనాలి రామకృష్ణుడు హాస్య చతురత కలిగిన కవి మాత్రమే కాదు.. శ్రీకృష్ణదేవరాయలుకి గూఢచారి కూడా. మా కథలోని డిటెక్టివ్ పాత్రకు కూడా అలాంటి షేడ్స్ ఉండడంతో ఈ టైటిల్ పెట్టాం.
‘వికటకవి’ పాత్రలోని చతురత మిస్ అవకుండా నరేష్ పాత్రను డిజైన్ చేశాం. తను ఈ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ ప్రాంతపు రాజుకు కూతురుగా, సైకియాట్రిస్ట్ పాత్రలో మేఘా ఆకాష్ నటించింది. వీళ్లిద్దరూ కాకుండా సిజు మీనన్, రఘు కుంచె, ముక్తార్ ఖాన్, రమ్య రామకృష్ణ, అశోక్ కుమార్, అమిత్ తివారి ఇతర పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ కూడా ఉండబోతోంది. ఇప్పటికే దీనిపై వర్క్ జరుగుతోంది’ అని చెప్పాడు.