చంద్రయాన్ 3 అద్భుతం : విక్రమ్ ల్యాండర్ గాల్లోకి లేచి.. 40 సెంటీమీటర్లు ప్రయాణం

చంద్రయాన్ 3 నుంచి అత్యంత కీలకమైన అప్ డేట్ ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ప్రజ్ణా రోవర్ అయితే నిద్రలోకి వెళ్లింది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ తన పనిని విజయవంతంగా.. చెప్పింది చెప్పినట్లు చేసింది. అదేంటో తెలుసా.. చంద్రుడిపై ఎగరటం.. అవును చంద్రయాన్ 3 ప్రయోగంలోనే ఇది అత్యంత కీలకమైనది. విక్రమ్ ల్యాండర్ లో ఉన్న ఇంధనాన్ని మండించటం ద్వారా.. ల్యాండర్ ను చంద్రుడి ఉపరి తలం నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు గాల్లోకి ఎగిరించారు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా గాల్లోకి లేచిన విక్రమ్ ల్యాండర్.. 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం ప్రయాణించి.. మరో ప్రదేశంలో సురక్షితం ల్యాండ్ అయ్యింది. 

ALSO READ :బీచ్ వాలీబాల్ ప్లేయర్గా కుక్క (వీడియో)

ఇందులో విశేషం ఏంటీ అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద విజయం. ఎందుకంటే చంద్రుడిపై దిగటం వరకే ఇప్పటి వరకు అందరూ చేశారు. ఇప్పుడు చంద్రుడి ఉపరితలం నుంచి మళ్లీ గాల్లోకి లేవటం అంటే.. భవిష్యత్ లో మానవ ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ ను 15 రోజుల తర్వాత విజయవంతంగా మళ్లీ గాల్లోకి లేపి.. అక్కడి నుంచి మరో ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయటం అనే టెక్నాలజీ, వ్యూహం.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండర్ లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది.  కాగా గత నెల ఆగస్టులో చంద్రయాన్-3 ల్యాండర్‌తో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.