భారత్ మరికొన్ని గంటల్లో చరిత్ర సృష్టించనుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లక్ష్యానికి అతి చేరువలో ఉంది. అంతరిక్ష నౌక చంద్రునికి అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్కు సిద్ధంగా ఉంది.
గురువారం(ఆగస్టు 17న) విజయవంతంగా ల్యాండర్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయిన తర్వాత.. నిన్న (ఆగస్టు18న) మొదటి డీబూస్టింగ్ ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది ఇస్రో. దీంతో అంతరిక్ష నౌక తన కక్ష్యను 113 కిమీ x 157 కిమీకి తగ్గించింది.
జాబిలిపై చంద్రయాన్ 3 రెండో డీబూస్టింగ్ ప్రక్రియను రేపు (ఆపరేషన్ ఆగస్టు20న) మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టనున్నారు ఇస్రో శాస్ర్తవేత్తలు. ఆగస్టు 23న సాయంత్రం 5.47 కి అంతిమ ఘట్టం విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది.
ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం..ల్యాండర్ మాడ్యూల్ మూడు పేలోడ్‌లు చంద్ర ఉపరితలాన్ని అధ్యయనం చేస్తాయి. పేలోడ్ RAMBHA-LP ప్లాస్మా అయాన్లు ,ఎలక్ట్రాన్ల సాంద్రతను కొలుస్తుంది. haSTE చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ ధ్రువ ప్రాంతానికి సమీపంలో ఉన్న చంద్ర ఉపరితలం ఉష్ణ లక్షణాల కొలతలను ఎప్పటికప్పుడు తెలుపుతుంది. ILSA (చంద్ర భూకంప చర్య కోసం పరికరం) ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంపాన్ని కొలుస్తుంది.
రోవర్ సాఫ్ట్-ల్యాండింగ్ తర్వాత..రసాయన కూర్పును పొందుతుంది. చంద్రునిపై ఖనిజాల కూర్పును అంచనా వేస్తుంది. రోవర్ ఇతర పేలోడ్-లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS)- చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్ర నేల, రాళ్లలో ఉన్న మూలకాలనిర్ధారిస్తుంది.