భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాంకేతిక రంగంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై చంద్రయాన్ 3 ని సక్సెస్ చేసేందుకు శుక్రవారం మరో అడుగు ముందుకు వేసింది. ల్యాండింగ్లో భాగంగా చంద్రునికి దగ్గరగా చంద్ర యాన్ 3 కక్ష్యను మరింత తగ్గించింది. ఆగస్టు 23న ల్యాండింగ్ ప్రక్రియను సక్సెస్ చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జూలై 14న చంద్రయాన్3 నింగికెగిసింది.. అప్పటి నుంచి జాబిల్లిని చేరేందుకు అంచలంచెలుగా విన్యాసాలు.. ఒక్కో కక్ష్యను దాటుకుంటూ 34 రోజులుగా విజయపథంలో దూసుకుపోతుంది. లక్ష్యం చేరేందుకు అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ సిద్ధంగా ఉంది. చంద్రయాన్-3ని చంద్రునిపై సక్సెస్ ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్‌ను చేసే ప్రక్రియతో ఇస్రో శాస్త్రవేత్తలు రెడీగా ఉన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
గురువారం మరో ప్రధాన మైలురాయిని దాటిన చంద్రయాన్ 3.. ఆగస్టు 23 న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగటమే ఆలస్యం.. ఈ ప్రయత్నంతో భారత్ చంద్రునిపై చేరిన దేశాల్లో అమెరికా, రష్యా, చైనా సరసన చేరి ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరించనుంది. చంద్రయాన్ 3 మిషన్ ను ఏపీలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ నుంచి GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. ఇది చంద్రునిపైకి భారత్ పంపిన మూడో ప్రయోగం.
ప్రజ్ఞాన్ రోవర్ నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ డీబూస్ట్ చేస్తున్నారు. 30 కి.మీ. పెరిలూన్ (చంద్రునికి కక్ష్య యొక్క అత్యంత సమీప బిందువు), 100 కి.మీ. అపోలూన్ (చంద్రుని నుండి అత్యంత దూరపు స్థానం) ఉన్న కక్ష్యలో దాని స్థానం కోసం "డీబూస్ట్" (నెమ్మదించే ప్రక్రియ) చేయడం మొదలుపెట్టారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించే పాయింట్ ఇది. ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలో నెలలు లేదా సంవత్సరాల పాటు దాని ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే అంతిమ ఘట్టం.. ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు షెడ్యూల్ చేశారు ఇస్రో అధికారులు. యునైటెడ్ స్టేట్స్, పూర్వపు సోవియట్ యూనియన్ చైనా తర్వాత ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. మరోవైపు రష్యా మూన్ మిషన్ లూనా-25.. చంద్రునిపై దిగేందుకు పోటీపడుతోంది. ఆగస్టు 21 నుంచి 23 మధ్య కాలంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది.