T20 World Cup 2024: ఓపెనర్‌గానే కోహ్లీ.. కన్ఫర్మ్ చేసిన భారత బ్యాటింగ్ కోచ్

T20 World Cup 2024: ఓపెనర్‌గానే కోహ్లీ.. కన్ఫర్మ్ చేసిన భారత బ్యాటింగ్ కోచ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లాడిన విరాట్ 7.25 సగటుతో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన సూపర్ 8 దశలో కూడా కోహ్లీ ఫామ్ లోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కోహ్లీ విఫలమవడానికి ఒక బలమైన కారణం వినిపిస్తుంది. ఓపెనర్ గా కోహ్లీ ఆడలేకపోతున్నాడని.. తనకు అచొచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే గాడిలో పడతాడని బయట నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తెర దించాడు. 

కోహ్లీ టోర్నీ మొత్తం ఓపెనర్ గానే బ్యాటింగ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీని మూడో స్థానంలో ఆడించే ఆలోచన లేదని.. ఆ మార్గాలుగా ఆలోచించడం లేదని ఆయన అన్నారు.  మా బ్యాటింగ్ ఆర్డర్ పట్ల మేము సంతృప్తిగా ఉన్నామని.. మార్పులు చేస్తే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని విక్రమ్ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో సూపర్ 8 మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విక్రమ్ రాథోర్.. టోర్నీలో మిగిలిన మ్యాచ్ ల్లోనూ భారత్ ఇదే బ్యాటింగ్ ఆర్డర్‌తో ఆడుతుందని చెప్పుకొచ్చాడు. 

కోహ్లీ తన కెరీర్ లో రెగ్యులర్ గా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో మాత్రం ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఐపీఎల్ లో సత్తా చాటిన కోహ్లీ.. 741 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో వరల్డ్ కప్ లోనూ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమవడానికి ఓపెనింగ్ కాదని కొందరు సమర్దిస్తుంటే.. తన ఫేవరేట్ స్పాట్ లో పరుగులు చేస్తే కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని మరికొందరు అంటున్నారు.