హనుమకొండ, వెలుగు: అట్టడుగు వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా 2047 లోపు అభివృద్ధి చెందిన భారత్‌గా నిలవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని కేంద్ర సహకార శాఖ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన వరంగల్ నగరానికి వచ్చారు. ముందుగా హనుమకొండకు చేరుకున్న ఆయనకు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ స్వాగతం పలికారు. అనంతరం హనుమకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడారు.
ఈ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మనందరి సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు చెందిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సమాచార మెటిరీయల్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖలు, బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ కేటాయింపు పత్రాలను అందించారు.