- మాట వినకున్నా, ఎదురు చెప్పినా బహిష్కరణ వేటు
- నిజామాబాద్ జిల్లాలో ఉక్కుపాదం మోపిన సీపీ కల్మేశ్వర్
- ఆయన ట్రాన్స్‌ఫర్ కావడం, పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్లీ యాక్టివ్
- చెప్పినట్లు వినని వారికి కఠిన శిక్షలు అమలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ(వీడీసీ)ల పెత్తనం మళ్లీ మొదలైంది. గ్రామ దేవతల జాతర్ల టైంలో అన్ని కులాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు యాభై ఏండ్ల కింద ఏర్పాటైన వీడీసీలు ప్రస్తుతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దళితులు, గిరిజనులపై పూర్తి అధికారం చెలాయిస్తూ, తాము చెప్పిందే శాసనం అన్న రీతిలో ప్రవర్తిస్తున్నాయి. గతంలో సీపీ కల్మేశ్వర్ కఠిన చర్యలు చేపట్టడంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న వీడీసీ సభ్యులు.. సీపీ ట్రాన్స్‌ఫర్‌తో మళ్లీ తమ ఆగడాలు స్టార్ట్ చేశారు.
తమ మాట కాదంటే వేటే...
కొన్ని గ్రామాలకు చెందిన వీడీసీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మాట కాదన్నా, తమకు వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే సదరు వ్యక్తులకు దారుణ శిక్షలు విధిస్తున్నారు. ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని ఎర్గెట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో కల్లు అమ్ముకునేందుకు గతేడాది వరకు రూ.1.30 లక్షలుగా ఉన్న వేలాన్ని ఈ సంవత్సరం వీడీసీ సభ్యులు రూ.2.50 లక్షలకు పెంచారు. ఇందుకు గౌడ కులస్తులు ఒప్పుకోలేదు. దీంతో తమ మాట కాదంటున్నారన్న కోపంతో కల్లు తాగేందుకు సదరు వ్యక్తుల వద్దకూ ఎవరూ వెళ్లొద్దని గ్రామంలో చాటింపు వేయించారు. ఆదేశాలు పాటించని వారికి రూ. 5 వేల ఫైన్ వేస్తామని హెచ్చరించారు.
దీంతో 40 గౌడ కుటుంబాలు నెలన్నర నుంచి గీత వృత్తికి దూరంగా ఉన్నాయి. కుటుంబ పోషణ భారంగా మారిందని వీడీసీని వేడుకోవడంతో వేలానికి సంబంధించిన రూ. రూ.2.50 లక్షలతో పాటు కల్లు బంద్ చేయించాక ఏర్పాటు చేసిన నిఘా కోసం ఖర్చయిన రూ.70 వేలు, ‘పెద్దల’ ఖర్చు మరో రూ.25 వేలు కలిపి మొత్తం రూ.3.45 లక్షలు చెల్లించి కల్లు అమ్ముకోవాలని చెప్పడంతో గీత కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
అలాగే గత నెల మొదట్లో వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో 90, 100, 120 గజాల పంచాయతీ ల్యాండ్‌ను అమ్మేందుకు వీడీసీ సభ్యులు అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ అమ్మకాన్ని కొందరు వ్యక్తులు వ్యతిరేకించడంతో ఆగ్రహానికి గురైన వీడీసీ సభ్యులు 8 బీసీ కుటుంబాలపై సంఘ బహిష్కరణ శిక్ష విధించారు. వారికి ఎవరూ సాయం చేయొద్దని, పొలం పనులకు వెళ్లవద్దని, కిరాణ షాపులు, హోటళ్లకు అనుమతించొద్దని హెచ్చరించారు. దీంతో బాధితులు తమకు అవసరమైన వస్తువులను పక్క గ్రామం నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో తమ మాట నెగ్గించుకునేలా..
నిజామాబాద్ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆర్మూర్, బాల్కొండ పరిధిలోని 221 గ్రామాల్లో వీడీసీల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. కల్లు దుకాణాలు, హోటళ్లు, చికెన్, మటన్ షాపులు, కూల్ డ్రింక్‌ల రేట్లను సైతం నిర్ణయిస్తున్న వీడీసీలు వేలం పాట ద్వారా బెల్ట్‌షాప్‌లను కేటాయించే స్థాయికి చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వారినే గెలిపించాలని హుకుం జారీ చేయడంతో పాటు గెలిచిన వారు సైతం తమ మాటే వినాలని ఆర్డర్ వేస్తున్నారు. ఐదేండ్ల కింద తొమ్మిది మంది సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలను వీడీసీలు వసూలు చేశాయన్న ఆరోపణలు వినిపించాయి. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏకగ్రీవం చేయడానికి ప్లాన్ చేసిన వీడీసీలు తమకు ఎవరూ ఎదురు మాట్లాడకుండా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత సీపీ ట్రాన్స్‌ఫర్‌తో..
అసెంబ్లీ ఎన్నికల టైంలో నిజామాబాద్ సీపీగా వచ్చిన కల్మేశ్వర్ సింగనెవార్ వీడీసీలు, సర్వ సమాజ్ కమిటీల పేరుతో చేస్తున్న ఆగడాలు, వారు విధించే శిక్షలను తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 122 మంది వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో గ్రామాల్లో వీడీసీ సభ్యుల ఆగడాలు ఆగిపోయాయి. అయితే సదరు సీపీ కల్మేశ్వర్ ట్రాన్స్‌ఫర్ కావడంతో వీడీసీలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు వీడీసీ సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.