వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం

వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట  రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం
  • అడిషనల్ కలెక్టర్ హెచ్చరికలు
  • అప్రజాస్వామిక  చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదంటూ వార్నింగ్ 

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరి ఆగడాలు మితిమీరిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పూనుకుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ వీడీసీల తప్పుడు, అనాలోచిత చర్యలపై ఇకనుంచి సీరియస్ గా  వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

ఇటీవల వీడీసీల బాధితులు కలెక్టర్​కు తమ గోడు వెల్లబోసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ దిశగా దృష్టి పెట్టారు. వీడీసీలు అప్రజాస్వామిక, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని సీరియస్​గా హెచ్చరించడం చర్చకు తావిస్తోంది. 

గుప్పిట్లో ఆర్థిక వనరులు

అన్ని కులాల నుంచి ఒకరు లేదా ఇద్దరేసి చొప్పున సభ్యులతో ఏర్పడుతున్న వీడీసీలు తమ గ్రామంలోని ప్రధాన ఆర్థిక వనరులను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బెల్టు షాపులకు వేలం నిర్వహిం చడం, ఎక్కువ మొత్తం పాడిన 
వారికి వాటిని అప్పజెప్పి అనుమతులు ఇవ్వడం, గ్రామంలోని వాగుల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు కూడగట్టుకుంటున్నాయి.

దీంతోపాటు గ్రామంలోని కూల్ డ్రింక్ దుకాణాలు, చికెన్ సెంటర్ల నిర్వహణ సైతం వీడీసీలు టెండర్ ద్వారా తమకు పెద్ద మొత్తంలో చెల్లించిన వారికి అప్పజెప్తున్నాయి. ఇలా గ్రామంలో అనధికారికంగా అన్ని రకాల వనరులపై పెత్తనం చేస్తున్నాయి. 

ధిక్కరిస్తే బహిష్కరణలే...

గ్రామంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్​లు అలాగే ఇతర ప్రజాప్రతినిధులను శాసించే స్థాయికి వీడీసీలు ఎదిగాయి. కుటుంబ తగాదాలు మొదలుకొని భూములు, ఇతర పంచాయతీలను సైతం వీడీసీలు పరిష్కరిస్తుంటాయి. అవి చేసే తీర్మానాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వారితో గ్రామంలోని ఏ ఒక్కరూ మాట్లాడకుండా వారికి సామాజిక బహిష్కరణ, అదికాకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్నాయి. 

ఇటీవల జిల్లాలోని మామడ, నర్సాపూర్, దిలావర్ పూర్, సారంగాపూర్, సోన్ తదితర మండలాల్లో వీడీసీల తీర్పులు, తీర్మానాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వారిని ధిక్కరిస్తే సామాజిక బహిష్కరణతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు కూడా వేస్తున్నారు. వీడీసీల చేత సామాజిక బహిష్కరణకు గురైన బాధితులు ఆందోళనలు చేపట్టారు. అలాగే పోలీస్ స్టేషన్లలోనూ వారిపై ఫిర్యాదులు చేశారు. 

రోజురోజుకు వీడీసీల ఆధిపత్యం, ఆగడాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. కాగా అధికారులు, రాజకీయ నేతలంతా వీడీసీల మెప్పు కోసం ప్రయత్నిస్తుండడం వారికి కలిసివస్తోంది. వీడీసీల ఆగడాలపై కలెక్టర్లు, అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీడీసీలు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే సహించబోమని అడిషనల్ కలెక్టర్ ​హెచ్చరించారు.

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు 

జిల్లాలో వీడీసీలు అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అమాయకులను వేధించడం గాని, శిక్షలు విధించడం లాంటి చర్యలు చేపట్టవద్దు. అనధికారికంగా ఏర్పడుతున్న వీడీసీల విషయంలో తమకు వస్తున్న ఫిర్యా దులపై విచారణ జరిపి చర్యలు చేపడతాం. ఇకనుంచి వీడీసీలు ఎలాంటి అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమైన పనులకు పాల్పడొద్దు.

- ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్, నిర్మల్