- ఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన నాయకులు
గజ్వేల్, వెలుగు: మల్లన్న సాగర్ కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని ముంపు గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్వాసిత గ్రామాలను గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని, మున్సిపల్ లో విలీనం చేస్తే పన్నుల భారం ఎక్కువవుతుందన్నారు.
అర్హత కలిగి ఇప్పటికీ ఆర్అండ్ఆర్ప్యాకేజీ రాని వారికి వెంటనే ఇవ్వాలన్నారు. చాలామంది ఒంటరి మహిళలు, పురుషులకు ఎలాంటి పునరావాస ప్యాకేజీ రాలేదని వారిని ఆదుకోవాలన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో నాయకులు స్వామి, రాము, బాలకిషన్, కనకయ్య, మల్లేశం, రాజు, యాదగిరి పాల్గొన్నారు.