- ఎండుతున్న గడ్డి, మొక్కలు
- కూర్చునే పరిస్థితిలేదు
- నీరుగారిన ప్రభుత్వ లక్ష్యం
- పట్టించుకోని అధికారులు
ఆసిఫాబాద్,వెలుగు: ఏజెన్సీలో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన విలేజీ పార్కులు కళా విహీనంగా మారాయి. దాదాపు 80 శాతం వనాల్లో కనీసం ఒక్క మొక్కలేదు. పార్కులన్నీ గడ్డితో నిండిపోవడంతో కనీసం కూర్చోవడానికి జాగా కరువైంది. చిట్టడవిని తలపించేలా ఉండాల్సిన పార్కులు పిచ్చిమొక్కలు, ఎండిపోయిన గడ్డితో నిండిపోయాయి. జిల్లాలో15 పంచాయతీల్లో చాలావరకు మొక్కలు లేనిచోట ప్రకృతి వనాలు అంటూ ఆఫీసర్లు బోర్డులు ఏర్పాటు చేయడం విశేషం.
మియావాకి విధానం అని..
గ్రామీణులకు ఆహ్లాదం, అడవుల సంరక్షణ, హరిత వనం పెంపకం.. తదితరాలు వివరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విలేజీ పార్కులు ఏర్పాటు చేసింది. దీనికోసం ఒక్కోదానికి రూ. 5 లక్షల చొప్పున ఖర్చుచేసింది. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు (మియావాకి విధానం) పెంచడానికి చర్యలు తీసుకుంది. ఈ విధానంతో మొక్కలు తొందరగా పెరగడమే కాక.. దట్టమైన మొక్కలతో వనంమాదిరిగా కనిపిస్తుందని ప్రభుత్వం ఆలోచించింది. ఒక్కో పంచాయతీ పరిధిలో ఎకరం స్థలంలో మూడువేల మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకుంది. వాటిని సంరక్షించి చిట్టడవిగా మార్చాలనుకుంది. కానీ.. క్షేత్రస్థాయిలో అదేమీ కనిపించడంలేదు. అయినా ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆఫీసర్లు నివేదికలు పంపడం విశేషం.
ఒక్కోచోట వందల్లో కూడా లేవు...
జిల్లాలో ఏర్పాటు చేసిన 1,102 విలేజీ పార్కులు గ్రామాలకు దూరంగా.. అడవులకు దగ్గరగా ఉన్నాయి. వాస్తవానికి ప్రకృతి వనాల్లో మియవాకి విధానం ప్రకారం కనీసం మూడు వరుసల్లో మొక్కలు పెంచాలి. వీటికి చిన్నగా పెరిగేవి, మధ్యరకం పెరిగేవి, చాలా ఎత్తుగా పెరిగే మొక్కలు నాటాలి. అయితే పంచాయితీల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో చాలావరకు ఈ పద్ధతిని పాటించలేదు. ఇష్టమొచ్చినట్లు మొక్కలు నాటి వదిలేశారు. అందుబాటులో ఉన్న మొక్కలు, పూల మొక్కలు, షో మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారు. ప్రకృతి వనంలో కనీసం ఎకరాకు మూడువేల మొక్కలు నాటాల్సి ఉండగా ఎక్కడ కూడా అది అమలుకాలేదు. మూడేండ్ల పాటు ఉపాధి హామీ పథకం నుంచి మొక్కలకు వాటరింగ్, వాచింగ్ కు డబ్బులు ఇవ్వగా గత ఏడాది గడువు ముగియడంతో పనులు ఆగిపోయాయి. దీంతో వనాల బాధ్యతను పంచాయతీలు చూస్తున్నాయి. అయితే వర్కర్లు, నీటి కోసం ఫండ్స్లేకపోవడంతో పార్కులన్నీ ఎండిపోతున్నాయి.
పూల మొక్కలు లేవు..
ఎండలు మండుతున్నాయి. సాయంత్రం సేదతీరడానికి దగ్గరలో పార్కులు లేవు. పల్లె ప్రకృతి వనంలో పోయిచూస్తే అక్కడ మొక్కలే కనిపించడంలేదు. పార్కు అంతా ఎండనే ఉంది. ఆహ్లాదం పంచని పార్కుల కోసం లక్షల రూపాయలు వృధా చేశారు. – మాడవి కోసేరావు, జైనూర్
ఎండల్లో తిప్పలవుతుంది
ఎండలు ఎక్కువైనప్పుడు చల్లదనం కోసం పార్కులకు పోదామంటే అక్కడ సౌలత్లే లేవు. సర్కార్ ఏర్పాటు చేసిన పార్కుల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన గడ్డే కనిపిస్తోంది. పార్కులు ఎందుకోసం నిర్మించినట్లు.. ఎవరి కోసం ఏర్పాటు చేసినట్లు. – ఆత్రం శ్రీనివాస్, ఎదల్ పాడ్, తిర్యాణి