బోధన్, వెలుగు : ఏటా హోలీ పండగ సందర్భంగా సాలూరా మండలంలోని హున్సాలో పిడిగుద్దులాట నిర్వహిస్తారు. వందేండ్లుగా ఈ ఆచారం కొనసాగుతుంది. పండగ నాటి పిడిగుద్దులాటకు గ్రామస్తులు వారం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. పండగ రోజు గ్రామంలోని చావిడి వద్ద గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామదేవతలకు ప్రత్యేకపూజలు చేస్తారు. అనంతరం గ్రామంలోని కులపెద్దలను డప్పులు వాయిద్యాలతో చావిడి వద్దకు తీసుకొస్తారు.
చావిడి వద్ద రెండువైపుల బలమైన కట్టెలు పాతి, వాటి మధ్యన తాడుకట్టుతారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా వీడిపోయి తాడును మధ్యలో పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఇలా 15 నుంచి 30 నిమిషాల పాటు సాగుతుంది. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
అనాదిగా వస్తున్న ఆచారం
పిడిగుద్దుల ఆచారం అనాదిగా వస్తోంది. ఆట నిర్వహించకుంటే గ్రామానికే అరిష్టమని నమ్ముతారు. ఆట నిర్వహిస్తేనే పాడి పంటలు పుష్కలంగా పండుతాయని, గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు ఎక్కడున్నా పండగ రోజు గ్రామానికి వస్తారు.
పిడిగుద్దులాటలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొనడం విశేషం. ఈ ఆటను చూసేందుకు జిల్లా ప్రజలే కాకుండా పక్కనున్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి ప్రజలు పెద్దఎత్తున వస్తారు. పండగ రోజున గ్రామంలో కుస్తీ పోటీలు, జాతర నిర్వహిస్తారు.