AP News : పెన్షన్ లో రూ.500 లంచం తీసుకున్న సచివాలయ ఉద్యోగి

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి నెల పెన్షన్ పంపిణి మొదలైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్ ను 4వేలకు పెంచారు సీఎం చంద్రబాబు. పెన్షన్ పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు తాడేపల్లిలో పెనుమాకలో స్వయంగా తానే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా వాలంటీర్లకు బదులుగా పెన్షన్ పంపిణీ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు చేతివాటం చూపిస్తున్నారు.పల్నాడు జిల్లా మాచర్లలో బాలు నాయక్ అనే సచివాలయ ఉద్యోగి లబ్ధిదారుల వద్ద 500రూపాయల చొప్పున లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

తమ వద్ద లంచం తీసుకుంటున్న ఉద్యోగి బాలు నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పింఛన్ దారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు అందుకున్న మునిసిపల్ కమిషనర్ ఘటనాస్థలికి చేరుకొని విచారించి బాలు నాయక్ ను సస్పెండ్ చేశారు.ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉద్యోగులను హెచ్చరించారు మునిసిపల్ కమిషనర్. వృద్దులకు అందించే పెన్షన్లో కూడా లంచం డిమాండ్ చేసే ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.