నెట్వర్క్, వెలుగు: గ్రామ, వార్డు సభలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 17, 18 వార్డులలో నిర్వహించిన వార్డు సభల్లో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. దరఖాస్తులు స్వీకరించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వార్డు అమ్మ గార్డెన్స్‌లో నిర్వహించిన గ్రామసభలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుతో కలిసి పాల్గొన్నారు.
ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూరులో, బజార్ హత్నూర్ మండలం జాతర్లలో జరిగిన గ్రామసభల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామసభలో చదివిన లిస్టులో పేర్లు లేకపోతే ఇక్కడే దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎవరూ అందుబాటులో లేకపోతే ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
పలు చోట్ల రసాభాస
పెంబి మండల కేంద్రంతో పాటు మందపల్లిలో జరిగిన గ్రామసభలు రసాభాసగా సాగాయి. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రజలు నిలదీశారు. సమగ్ర సర్వేలో పెట్టుకు న్న వినతులకు సగానికి పైగా రాలేదని, ఇది ఎవరి తప్పిదమని ప్రశ్నించారు. సమగ్ర సర్వే ప్రకారమే ఎంపిక జరిగిందని, లిస్టులో పేర్లు లేని వారు మళ్లీ వినతులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు. గతంలో చేపట్టిన ప్రజాపాలనలో అన్ని వివరాలతో దరఖాస్తు చేస్తే ఇప్పుడు లిస్టులో తమ పేరు లేదని కుంటాల మండలంలోని లింబా కే గ్రామసభలో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇవ్వాలని ప్రశ్నించారు. పలు గ్రామాల్లో పోలీసు పహారాలో గ్రామ సభలు నిర్వహించారు. కౌటాల మండలం బోధంపల్లిలో గ్రామసభకు అధికారులు ఆలస్యంగా రావడంతో గ్రామస్తులు మండిపడ్డారు. 12 గంటలకు తీరిగ్గా రావడంతో ఉదయమే వచ్చి ఎదురుచూసిన గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. నేరడిగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో ఆఫీసర్లతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. అర్హుల పేర్లు కాకుండా అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. నాలుగు స్కీముల్లో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులైన వారి పేర్లను చేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో గొడవ సర్దుమనిగింది. మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీవో రాజ్ వీర్ పాల్గొన్నారు.