లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నడుస్తున్న ఒకే బస్సులో రద్దీ పెరిగి రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరో బస్సు వేయాలని పొన్కల్ గ్రామస్తులు, స్టూడెంట్లు డిమాండ్ చేశారు. మంగళవారం పొన్కల్ గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద బస్సును నిలిపివేసి ధర్నాకు దిగారు. నిర్మల్ నుంచి పొన్కల్ మీదుగా కమల్‌కోట్ గ్రామం వరకు ఆర్టీసీ ఓకే బస్సును ఐదు ట్రిప్పులు నడిపిస్తోందని, దీంతో వివిధ పనుల కోసం వెళ్లే పొన్కల్, ఆదర్శనగర్, న్యూ టెంబరేణి పోతారం, అనంతపేట్, బండల ఖానాపూర్, చందారం గ్రామాలకు చెందిన వందలాది మంది బస్సులో రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆర్టీసీ డీఎంకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.