- ఎల్కలపల్లి యాష్‌పాండ్ నుంచి బూడిద సప్లై టెండర్ల రద్దుకు డిమాండ్
- ఇప్పటికే కుందనపల్లిలో యాష్‌పాండ్‌తో అవస్థలు పడుతున్నామని ఆవేదన
- ఎల్కలపల్లిని మరో కుందనపల్లిగా మార్చొద్దు
గోదావరిఖని, వెలుగు: యాష్ పాండ్‌ల నుంచి బూడిద రవాణాకు అనుమతించొద్దని ఎన్టీపీసీపై సమీప గ్రామస్తులు పోరుబాట పట్టారు. నియోజకవర్గ పరిధిలోని ఎల్కలపల్లి, లక్ష్మీపురం, గుంటూరుపల్లి, ఎల్కలపల్లిగేట్ ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు తమ గ్రామాల సమీపంలోని వాటర్రిజర్వాయర్ నుంచి బూడిద రవాణాకు తీసుకుంటున్న చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కుందనపల్లిలో ఏర్పాటుచేసిన యాష్‌పాండ్‌తో రోగాలబారిన పడుతున్నామని నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. తాజాగా ఎల్కలపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన యాష్‌పాండ్ నుంచి బూడిద రవాణాకు టెండర్లు పిలవడంపై సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. యాష్‌పాండ్ నుంచి బూడిద తరలిస్తుండగా వెలువడే దుమ్ము ధూళితో రోగాల బారిన పడతామని సమీప గ్రామాల ప్రజలు ఇటీవల ధర్నాకు దిగారు.
ఇప్పటికే ఆరోగ్య సమస్యలు
ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి కుందనపల్లి గ్రామ శివారులోని యాష్‌పాండ్‌లో నిల్వతో కుందనపల్లి, బద్రిపల్లి, అక్బర్‌నగర్, రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండాకాలంలో బూడిద గాలిలో కలిసి ఆయా గ్రామాలను కప్పేస్తుండడంతో కళ్లలో బూడిద పడడం, దానిని పీల్చడం వల్ల శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో యాష్‌పాండ్‌లోని నీరు ఆయా గ్రామాల్లోని బోర్లు, బావుల్లోకి చేరుకొని ఆ నీటిని వాడిన వారు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఈ గ్రామాల్లో జీవించలేమని, తమకు వేరే ప్రాంతాలలో పునరావాసం కల్పించాలని కుందనపల్లి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు.
బూడిద రవాణా టెండర్లు రద్దుకు డిమాండ్
రామగుండం ఎన్టీపీసీ ఏర్పాటు కోసం 1975లో దాదాపు 14 గ్రామాలకు చెందిన వేల ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుని ఆ సంస్థకు అప్పగించింది. వీటిలో ఎల్కలపల్లి, లక్ష్మీపురం, గుంటూరుపల్లి, ఎల్కలపల్లి గేట్ ప్రాంతాలకు చెందిన సుమారు 2 వేల ఎకరాలున్నాయి. కాగా నాడు ఈ భూములకు ఎన్టీపీసీ మేనేజ్మెంట్ నామమాత్రంగా డబ్బులు చెల్లించింది. ఎల్కలపల్లి సమీపంలో ఎన్టీపీసీ ప్లాంట్ అవసరాల కోసం ఓ రిజర్వాయర్‌ను నిర్మించి నీటిని నిల్వ చేశారు. అనంతరం ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్లాంట్‌లో బొగ్గు మండించడం ద్వారా విడుదలయ్యే బూడిదను రిజర్వాయర్‌కు పైపుల ద్వారా మళ్లిస్తున్నారు.
ఇలా రిజర్వాయర్‌లో నిండిన బూడిదను తిరిగి ఇతర అవసరాల కోసం తరలించేందుకు ఎన్టీపీసీ టెండర్లను ఆహ్వానించింది. బూడిద రవాణాతో దుమ్ము, ధూళి చెలరేగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుందనపల్లి శివారులో నిర్మించిన యాష్‌పాండ్ నుంచి ఎగిసిపడే బూడిదతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఆ టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.