కళ్లెంపల్లిలో చిరుత సంచారం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లెంపల్లి పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని తెలిసి గ్రామస్తులు వణికిపోతున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో వారం వ్యవధిలో రెండు మేకలపై దాడి చేయడంతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. 

మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని గుట్ట వద్ద ఓ నీలుగాయిపై చిరుత దాడికి యత్నించడం కొందరు చూశారు. నీలుగాయిని గోరిగల తొవ్వ మీదుగా పంట పొలాల వరకు తరుముకుంటూ వచ్చిందని అటవీ అధికారులకు తెలిపారు.

 పెద్దగా కేకలు వేయడంతో నీలుగాయిని వదిలి అటవీ ప్రాంతంలోకి చిరుత పరుగులు తీసిందని వివరించారు. అలెర్ట్ అయిన అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఒడ్డుగూడం ఎఫ్ఎస్​ఓ మీర్జా జియా ఉల్లాబేగ్, ఎఫ్​బీఓ ప్రణయ్​అవగాహన కల్పించారు. 

అత్యవసరమైతే ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్లాలని..రేకుడబ్బా, పటాకులు తీసుకెళ్లాలన్నారు. సోమవారం ఓ మేకపై దాడి చేసిన ప్రాంతం వైపు చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అక్కడ సీసీ కెమెరాలు అమర్చారు.