- సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూమి ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి యత్నించారు. గుడిబండ గ్రామంలో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కవిత కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపిస్తూ మంగళవారం కొందరు నాయి బ్రాహ్మణులు ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమ స్థలాలు తమకు అప్పజెప్పాలని ఆమె ఇంటి ముందు టెంట్ వేసి కూర్చున్నారు. దీనికి కవిత అనుచరులు అభ్యంతరం తెలపడంతో పరిస్థితి ఘర్షణకు దారి తీసింది. మహిళలు జుట్లు పట్టుకొని తన్నుకున్నారు.
ఈ క్రమంలోనే కవితపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె అనుచరులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంతసేపటి తరువాత పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. చివరకు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అనంతరం పోలీసులు ఆందోళనకారులు వేసిన టెంటును తొలగించేందుకు ప్రయత్నించడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిలో ఒకరు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ స్థలానికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని, విచారణ జరుగుతున్నదని తెలిపారు. విచారణ పూర్తయ్యి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్మాణాన్ని సీజ్ చేశారు.