అచ్చం పేట, వెలుగు: బల్మూర్ మండలం మైలారం గ్రామ సమీపంలో 123 ఎకరాల్లో క్వాట్జ్ గుట్టను తవ్వేందుకు లీజుదారుడు రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. గుట్టను తవ్వుకునేందుకు 2021లో మైనింగ్ ఆఫీసర్లు అనుమతులు ఇచ్చారు. గతంలో గుట్టను తవ్వేందుకు రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. మూడేండ్ల తరువాత శుక్రవారం మరోసారి టిప్పర్లు, జేసీబీతో గుట్టను తవ్వేందుకు రాగా గ్రామస్తులు అడ్డుకోవడంతో అచ్చంపేట సీఐ రవీందర్, బల్మూర్ ఎస్ఐ బాలరాజు అక్కడికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నించారు.
గ్రామస్తులు వినకపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సీఐ ప్రకటించారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని గతంలో కలెక్టర్, మైనింగ్ ఆఫీసర్లకు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. గుట్టను తవ్వకుండా అడ్డకుంటామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.