
- తాళాలు పగలగొట్టి వెళ్లిన కొందరు గ్రామస్తులు
- ఇండ్లివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన
- రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు నచ్చజెప్పినా వినలేదు
నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో డబుల్ ఇండ్ల వద్ద లొల్లి నెలకొంది. కొందరు స్థానిక వ్యక్తులు వెళ్లి ఇండ్ల తాళాలు పగలగొట్టి హంగామా చేశారు. దీంతో అధికారులు వెళ్లి నచ్చజెప్పినా వినలేదు. వివరాల్లోకి వెళ్తే.. గత సర్కార్ కట్టించిన ఇండ్లకు గ్రామానికి చెందిన కొంత మంది వద్ద డబ్బులు వసూలు చేయగా.. తమకే వస్తాయని ధీమాలో ఉండిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇండ్లు రావని ఆందోళనలో పడిపోయారు.
ఇండ్లను పంపిణీ చేయడంలేదని గురువారం కొందరు తాళాలు పగలగొట్టి డబుల్ ఇండ్లలోకి వెళ్లారు. సమాచారం అందడంతో రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు వెళ్లి ఖాళీ చేయించేందుకు యత్నించారు. తమకు ఇండ్లు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, అర్హులను గ్రామసభల్లో ఎంపిక చేస్తామని తహసీల్దార్ మహబూబ్ అలీ చెప్పినా వినలేదు. ఇండ్లకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని సూచించినా తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ చెప్పినా పట్టించుకోకుండా రాత్రి వరకు ఇండ్లలోనే కూర్చున్నారు. దీంతో డబుల్ ఇండ్ల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.