పర్వతగిరి, వెలుగు : భారీ వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తూములకు రిపేర్లు చేస్తుండడం, గేట్లను ఓపెన్ చేసే వీలు లేకపోవడంతో నీరంతా కట్ట మీది వరకు చేరింది. కట్టకు గండి పడితే సగం ఊరు మునిగిపోయే ప్రమాదం ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు, సర్పంచ్ శోభ వెంటనే స్థానిక ఎస్సై వీరభద్రరావుకు ఫోన్ లో సమాచారం అందించారు.
AsloRead: పిత్తాశయంలోని రాళ్లకు బదులు మహిళ గర్భాశయాన్నే తీసేసిండు
అలర్ట్ అయిన పోలీసులు రెండు జేసీబీలతో బూరుగుమడ్ల వెళ్లే దారిలో చిన్న మత్తడి వద్ద బుధవారం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రమించి గండి పెట్టారు. గురువారం ఉదయం రెండు షట్టర్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో చెరువులోని నీరు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రంతా శ్రమించిన ఎస్సై వీరభద్రరావు, పోలీసులను గ్రామస్తులు, సీపీ రంగనాథ్ అభినందించారు.