బెల్టు తీసిండ్రు.. గ్రామాన్ని కదిలించిన యువకుడి ఆత్మహత్య

బెల్టు తీసిండ్రు
గ్రామాన్ని కదిలించిన యువకుడి ఆత్మహత్య
శవంతో బెల్ట్ షాపు నిర్వాహకుడి ఇంటి ముందు ధర్నా
చౌరస్తాలో లిక్కర్ బాటిళ్లు పగులగొట్టి నిరసన
ఊళ్లో మద్యం అమ్మితే రూ. 5 లక్షల జరిమానా
కామారెడ్డి జిల్లా రామేశ్వర్ పల్లి వాసుల తీర్మానం

కామారెడ్డి/భిక్కనూరు : ఓ యువకుడి ఆత్మహత్య ఆ ఊరిని కదిలించింది.. బెల్టు షాపును ఊరిలోంచి తరిమేసింది. ఇకపై ఊళ్లో ఎవరైనా మద్యం అమ్మితే రూ. 5 లక్షల జరిమానా చెల్లించాలని తీర్మానం చేయించింది. కామారెడ్డి జిల్లాలో చైతన్యానికి మారుపేరుగా ఉన్న భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి ఇందుకు రోల్ మోడల్ గా నిలిచింది. గ్రామానికి చెందిన నాగర్తి నరేశ్ రెడ్డి (37) కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. లిక్కర్ కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక నిన్న రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం (జూన్ 13న) ఉదయం నరేశ్​ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. 

బెల్టుషాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందకు తీసుకెళ్తూ బెల్ట్ షాపు ముందు ఆపి నిరసన తెలిపారు. మందుకు బానిసవడం తోనే నరేశ్​ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం చెందిన గ్రామస్తులు బెల్టు షాపులోంచి లిక్కర్ బాటిళ్లు తీసుకొచ్చి ఓ కూడలి వద్ద ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మద్యం అమ్మొద్దని తీర్మానం చేశారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే రూ. 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. రామేశ్వర్ పల్లి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వాగతిస్తున్నారు.