ఊర్లో ఉండలేం..వేరేచోటుకు వెళ్లలేం

ఊర్లో ఉండలేం..వేరేచోటుకు వెళ్లలేం

ఊర్లో ఉండలేం..వేరేచోటుకు వెళ్లలేం
కల్యాణిఖని ఓపెన్​ కాస్ట్​ బాధిత దుబ్బగూడెం గ్రామస్తులు
పునరావాసం కోసం ఎదురుచూపు
ఆందోళనలు చేసినా పట్టించుకోని సింగరేణి మేనేజ్​మెంట్​

కోల్​బెల్ట్, వెలుగు :  మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టు ముంపు గ్రామమైన దుబ్బగూడెం(కాసీపేట మండలం)  గ్రామస్తులు పునరావసం అందక కష్టాలు పడ్తున్నారు. సింగరేణి ఓపెన్​కాస్ట్​ గని కోసం  2012లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి 2015-–16లో  బొగ్గు వెలికితీత పనులు  ప్రారంభించారు.  ఏడేండ్లుగా  గనిలో బ్లాస్టింగ్​లకు దుబ్బగూడెంలోని ఇండ్లు బీటలు వారి 20 వరకు నేలకూలాయి. నెర్రెలు బాసిన ఇండ్లు ఎప్పుడు కూలుతాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  వానాకాలం వచ్చిదంటే చాలు గోడలు నాని కూలిపోతాయనే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలో సుమారు 240 కుటుంబాలు, 520 మంది జనాభా ఉంది. 

పరిహారం చెల్లింపులో జాప్యం..

దుబ్బగూడెంలో ఇండ్లు, జాగలు కోల్పోయిన గ్రామస్తులకు  పరిహారం అందించడంలో ఆఫీసర్లు జాప్యం చేశారు. నష్టపరిహారం అందక, వేరే ఊరికి వెళ్లలేక ఏండ్ల తరబడి ప్రజలు ఇక్కడే ఇబ్బందులు పడుతూ  ఉంటున్నారు. సర్వేలు, పాత, కొత్త జీవోల పేరుతో పరిహారం చెల్లింపులో సర్కార్​,  సింగరేణి నిర్లక్ష్యంపై గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేశారు. దీంతో గత నవంబర్​లో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ  చేపట్టినా అందులో బోగస్ ఇండ్లకు భారీగా పరిహారం ప్రకటించారని ఆరోపణలు రావడంతో  రీసర్వే  చేయాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. 

ఉపాధి అవకాశాలు ఉత్తమాటే..

ఓసీపీ ఏర్పాటు సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణలో ఆఫీసర్లు  స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.  ఓసీపీతో  జీవనాధారమైన పంట భూములు గనిలో కలిసిపోయాయి. దీంతో  రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులకు సింగరేణి మేనేజ్​మెంట్​ ఉద్యోగాలు కల్పించడంలేదు. ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్ స్థానికేతరులు,​ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లతోనే పనులు చేయించుకుంటున్నారు.  దీంతో స్థానిక యువకులకు ఉపాధి లేకుండా పోయింది. స్థానిక సింగరేణి మేనేజ్​మెంట్​ వీరికి అండగా నిలిచి ఆదుకోవడానికి చొరవ చూపడంలేదు. సమస్యలు తీర్చాలని ఆందోళనకు దిగితే మేనేజ్​మెంట్ పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటూ మభ్యపెడ్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ALSO READ:ఢిల్లీకి బండి సంజయ్..హైకమాండ్​ పిలుపుతో పయనం 

పునరావాసంపై  నిర్లక్ష్యం

కళ్యాణిఖని ఓసీపీలో ఇండ్లు కోల్పోయిన దుబ్బగూడెం నిర్వాసితుల కోసం కాసీపేట మండలంలోని పెద్దనపల్లి శివారులోని సర్వే నంబర్​ 5లో 32 ఎకరాల భూమిని సింగరేణి మేనేజ్​మెంట్​ కొనుగోలు చేసింది. ఎకరాకు సుమారు రూ.12లక్షలు ఇచ్చింది. ఇక్కడ సుమారు 300 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఏడేండ్లుగా పునరావాస కాలనీ ఏర్పాటు కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు.  రెవెన్యూ ఆఫీసర్లు సుమారు ఏడాది కింద భూమిని సింగరేణికి అప్పజెప్పిన ఇప్పటి వరకు పునరావాస కాలనీ పనులను షురూ చేయలేదు.  సింగరేణి మేనేజ్​మెంట్​ నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించి అక్కడ తాగునీరు, కరెంట్​, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు ఏర్పాటు, ఇతర మౌలిక సౌలత్​లను కల్పించాల్సి ఉంది.