
- దారి లేదు.. వాగు దాటి ఎట్లా పోవాలే
- తడ్కల్ కొత్త మండలంలో కలపడంపై నాలుగు గ్రామాల ప్రజల ఆందోళన
సంగారెడ్డి/కంగ్టి, వెలుగు : తమ గ్రామాలు తడ్కల్ మండలంలో కలుపొద్దని, కంగ్టిలోనే ఉండనివ్వాలని నాగన్ పల్లి, గాజుల్ పాడ్, సుక్కల్ తీర్థ్, హోబా తండా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రకటించిన తడ్కల్ మండల కేంద్రానికి పోవాలంటే పెద్ద వాగు ఉండడం వల్ల ఆ నాలుగు గ్రామాలకు దారి లేకుండాపోయింది. ఒకవేళ చుట్టూ తిరిగి పోవాలంటే ఆ దారి కూడా సరిగ్గా లేకపోగా, దాదాపు 25 కిలోమీటర్లు తిరిగెళ్లాలి. అందుకే తమకు కొత్త మండలం తడ్కల్ వద్దని, కంగ్టియే కావాలని ఆ గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.
ఇదీ పరిస్థితి..
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ఉన్న 16 గ్రామాలను విడదీసి తడ్కల్ కొత్త మండలంగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఇందులో దాదాపు 12 గ్రామాలకు తడ్కల్ వెళ్లాలంటే రహదారులతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వెహికల్స్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ నాగన్ పల్లి, గాజుల్ పాడ్, సుక్కల్ తీర్థ్, హోబా తండాకు మాత్రం అవేవీ లేవు. ఆ గ్రామస్తులు తడ్కల్ వెళ్లాంటే పెద్ద వాగు అడ్డం వస్తోంది. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 6 కిలోమీటర్ల దూరంలో తడ్కల్ ఉంటుంది.
అలా కాకుండా ఇప్పుడున్న దారిలో వెళ్లాలంటే వడ్ గావ్, కంగ్టి, చాప్టా(కే) మీదుగా తడ్కల్ మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే 25 కిలోమీటరట్లు అదనంగా తిరగాల్సి వస్తుంది. పైగా రహదారి కూడా సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో తమ గ్రామాలను10 కిలోమీటర్లలోపు ఉన్న కంగ్టిలోనే కొనసాగించాలని ఆ నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లేకపోతే వాగుపైన బ్రిడ్జినైనా నిర్మించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ రెండు ప్రతిపాదనలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆ గ్రామాల ప్రజలంతా కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వినూతన్న నిరసన తెలుపుతున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తుండటంతో రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
పాత మండలంలోనే ఉంచాలి
పెద్ద వాగులో మనిషి మునిగిపోయేంతగా నీరు ఉంటుంది. కిలో మీటర్ దూరం లేని రాసోల్ గ్రామంలో ఉన్న తమ వ్యవసాయ పొలాలకు పోలేని పరిస్థితి ఉంది. అలాంటిది తడ్కల్ మండలంలో మా గ్రామాన్ని కలిపితే వాగు ఎట్లా దాటాలే. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే తప్ప తడ్కల్ పోలేం. అందుకు మా ఊరును పాత మండలంలోనే ఉంచాలి. - కురుమ రాంగొండ, గాజుల్ పాడ్ గ్రామం
మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు
మా గ్రామాలను దారిలేని తడ్కల్ మండలంలో కలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. కలుపాల్సిందే అంటే తప్పనిసరిగా వాగుపైన బ్రిడ్జిని వెంటనే కట్టండి. లేకపోతే మా గ్రామాన్ని ఎప్పటిలాగే కంగ్టిలోనే కొనసాగించండి. అలా కాదని నాలుగు గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
సురేశ్పాటిల్, సుక్కల్ తీర్థ్