నవాబుపేట, వెలుగు: తొక్కు పెట్టనింకె ఊర్లోకి ఇద్దరు వ్యక్తులొచ్చారు. రోజంతా ఉండి 2 క్వింటాళ్ల తొక్కు పెట్టి వెళ్లిపోయారు. మధ్యలో ఉప్మా కూడా వండిపెట్టారు. ఆ తర్వాత రోజే తెలిసింది వాళ్లిద్దరికీ కరోనా సోకిందని. దీంతో ఊరు ఊరంతా వణికిపోతోంది. ‘భయపడి చస్తున్నం.. టెస్టులు చేయండి’ అని మొత్తుకుంటోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇద్దరితో ఎక్కువగా కాంటాక్టయిన 12 మందికైనా పరీక్షలు చేయండంటూ ఊరోళ్లు మొర పెట్టుకుంటున్నరు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు 100 మందికి పైగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
అసలేం జరిగిందంటే?
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త లాక్డౌన్ టైమ్‌లో ఊరంతటికీ ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. కొంత డబ్బు విరాళంగా రావడంతో మామిడి తొక్కు పెట్టి ఊరంతా పంచాలనుకున్నాడు. షాద్‌నగర్‌లో ఉంటున్న తన బంధువు, చిట్టీల వ్యాపారి అయిన వ్యక్తి దగ్గరకు 18న కారులో వెళ్లారు. హైదరాబాద్‌లోని జియాగూడకు వెళ్లొచ్చిన ఆ వ్యాపారికి అప్పటికే కరోనా సోకింది. అయితే శాంపిల్స్ పంపినా అప్పటికింకా రిపోర్టు రాలేదు. ఆ ప్రజాప్రతినిధి భర్త, చిట్టీల వ్యాపారి.. మామిడి తొక్కు పెట్టేవారిని కలిసి తొక్కు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. తిరిగి ఊరికొచ్చిన ప్రజాప్రతినిధి భర్త.. గ్రామంలో మీటింగ్ పెట్టాడు. ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా సమావేశానికి వచ్చారు. అదే రోజు రెండు పంచాయితీలకు తీర్పు చెప్పారు. 20న షాద్‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరొచ్చారు. రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు. అంతా దాన్ని రుచి చూశారు. వారితోనే ఉప్మా వండించుకొని తిన్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్‌చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ అదే రోజు చిట్టీ వ్యాపారికి పాజిటివ్ కన్ఫమ్ అయింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ తర్వాతి రోజు పాజిటివ్ వచ్చింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరికీ భయం మొదలైంది.
తొక్కంతా పారేసిన్రు
తొక్కు పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కును డంప్ యార్డులో పడేశారు. ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తొక్కు పెట్టిన వాళ్లతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 12 మందికైనా టెస్టులు చేయండని వేడుకున్నారు. కానీ లక్షణాల్లేనిదే టెస్టులు చేయమని చెప్పి ప్రజాప్రతినిధి భర్తతో పాటు 12 మందిని, వారి కుటుంబ సభ్యులు సహా మరో 100 మందిని హోం క్వారంటైన్ పంపారు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో షాపులు కూడా తీయడం లేదు. ప్రజాప్రతినిధి భర్తతో పాటు పలువురికి కరోనా లక్షణాలున్నాయని చెబుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఎవరికి వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని కోరుతున్నారు.
కరోనాతో రేషన్ డీలర్ మృతి
గోదావరిఖని, వెలుగు: కరోనా వైరస్ సోకి ఎన్టీపీసీకి చెందిన రేషన్ డీలర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. కొంతకాలంగా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్సకోసం హైదరాబాద్‌కు వచ్చారు. మియాపూర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కేన్సర్ ఉందనే అనుమానంతో డాక్టర్లు శాంపిల్ సేకరించి, పుణే ల్యాబ్‌కు పంపించారు. అక్కడ కేన్సర్ టెస్టులతో పాటు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయనతో పాటు ఉంటున్న భార్య, పనిమనిషి, అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌కు కూడా వైరస్ సోకింది. దీంతో వారు నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ చేశారు. కరోనా కారణంగా డీలర్ చనిపోయిన విషయం తెలిసి ఎన్టీపీసీలో ఉన్న ఆయన కొడుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. డీలర్ మృతిపట్ల రామగుండం ఏరియా డీలర్ల సంఘం సంతాపం వ్యక్తంచేసింది. జూన్ నెల బియ్యం పంపిణీకి జాగ్రత్తలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు.
ఇంత నిర్లక్ష్యమా?
కరోనా ఉన్న వ్యక్తులు మా ఊరికొచ్చి, రోజంతా మా మధ్యే ఉన్నారు. మాలో ఎవరికి వైరస్ ఉందో తెలియక టెన్షన్‌గా ఉంది. టెస్టులు చేయాల్సిన ఆఫీసర్లు హోమ్ క్వారంటైన్‌లో ఉండమని చెప్పి పత్తాలేకుండా పోయారు. మండల ప్రజా ప్రతినిధులు, లీడర్లు కూడా ముఖం చూపిస్తలేరు. ప్రైమరీ కాంటాక్ట్ వాళ్లకైనా టెస్టులు చేయండని ఎంపీటీసీగా నేను ఎన్ని సార్లు అడిగినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. ఇంత నిర్లక్ష్యమా?
– తుల్సీరాం నాయక్, ఎంపీటీసీ, కొల్లూరు
టెస్టులెందుకు చేయరు?
అనుమానం ఉంది. టెస్టు చేయమంటే చేయాలి గానీ చేయబోమంటే ఎట్ల? పాజిటివ్ వచ్చినోళ్లతో ఊరోళ్లు తిరిగారు. వాళ్లు పెట్టిన తొక్కు, వండిన ఉప్మా రుచి చూశారు. లక్షణాలు బయటపడొచ్చు. పడకపోవచ్చు. వృద్ధులు, పిల్లలకు సోకితే కష్టం కదా? అందరికీ టెస్టులు చేయాలి.
– డీఎన్ రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్, కొల్లూరు
భూపాలపల్లి వైపు మిడతలు వచ్చే ఛాన్స్