మెట్​పల్లి ఎంపీపీ గ్రామ బహిష్కరణ

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ కోనరావుపేట గ్రామస్తులు తీర్మానం చేశారు. మట్టి, ఇసుక  తవ్వకాల్లో కోనరావుపేట, కొండ్రికర్ల  గ్రామాల మధ్య చిచ్చుపెట్టి కొండ్రికర్లకు వత్తాసు పలుకుతున్నాడని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సమావేశమైన గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కొండ్రికర్ల గ్రామస్తులు అనుమతి లేకుండా మట్టి తరలిస్తుండగా జేసీబీలు, ట్రాక్టర్లు పట్టుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. 

ఎంపీపీ  సాయిరెడ్డి ప్రోద్బలంతో కొండ్రికర్ల గ్రామస్తులు పంచాయతీ కార్మికులను కొట్టి వాహనాలు తీసుకెళ్లారన్నారు. ఆయన వల్లే రెండు గ్రామాల మధ్య గొడవలు జరుతున్నాయని అందుకే గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించామన్నారు. వీడీసీ ప్రెసిడెంట్ పెంట ప్రవీణ్, సురకంటి నారాయణ, మోహన్ రెడ్డి, కాటిపల్లి సాయిరెడ్డి, రాజారెడ్డి, శేఖర్ రెడ్డి, గణేశ్, మారుతీరెడ్డి, రమేశ్, రాజ నర్సయ్య  పాల్గొన్నారు.