కార్పొరేషన్​లో కలపొద్దు..రోడ్డెక్కిన నర్సింగాపూర్ గ్రామస్తులు

కార్పొరేషన్​లో కలపొద్దు..రోడ్డెక్కిన నర్సింగాపూర్ గ్రామస్తులు
  •     మూడు గంటల పాటు ధర్నా 

మంచిర్యాల, వెలుగు : కొత్తగా ప్రకటించిన మంచిర్యాల కార్పొరేషన్​లో తమ గ్రామాన్ని కలపొద్దని హాజీపూర్ మండలం నర్సింగ పూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. పంచాయతీగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్ చేస్తూ హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను విలీనం చేస్తూ గెజిట్ రిలీజ్ చేశారు. దీన్ని వ్యతిరేస్తూ నర్సింగపూర్ గ్రామస్తులు భారీ సంఖ్యలో సోమవారం ఉదయం ఎన్​హెచ్63పైకి చేరుకొని ధర్నాకు పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్​పాండే గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో హైవే పక్కన ధర్నా చేశారు. కలెక్టర్ రావాలంటూ 3 గంటల పాటు నిరసన తెలిపారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని తహసీల్దార్, ఏసీపీలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నర్సింగాపూర్​లో 2500 జనాభా ఉందని, 70 శాతం మంది కూలి పని పైనే ఆధారపడి బతుకుతున్నామన్నారు. 

ఉపాధి హామీ స్కీమ్​తో వంద రోజులు ఉపాధి పొందున్నామని, కార్పొరేషన్ లో కలిపితే తిండికి తిప్పలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్ముడుపోయారంటూ మండిపడ్డారు. రెండు రోజుల్లో న్యాయం చేయకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.