జమ్మికుంట, వెలుగు: “ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు.. ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావా..? ఎన్నికలప్పుడు ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి మాట తప్పినవ్.. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావంటూ..” హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నిస్తూ నిలదీశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ లో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే రాగానే గ్రామస్తులు చుట్టుముట్టారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి లబ్ధి జరగలేదని గుర్తుచేశారు. కొందరు స్టేజి వద్దకు వెళ్లి ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు వెళ్లారు. చచ్చిపోతానని బెదిరిస్తే ఓటేశామని.. పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ప్రజలకు న్యాయం చేయండి : కౌశిక్ రెడ్డి
‘‘దండం పెడుతున్న సారు.. మా ప్రజలకు న్యాయం చేయండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయండి’’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికారులను కోరారు. గ్రామసభకు ఆయన వస్తున్నారనే సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా పోలీసులకు పూలు ఇచ్చి.. తనను కొట్టవద్దంటూ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని అధికారులను కొందరు ప్రశ్నించారు. వీణవంక మండలం చల్లూర్ గ్రామసభలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.