
బెజ్జంకి, వెలుగు: ఇథనాల్ఫ్యాక్టరీ నిర్మిస్తే మూకుమ్మడిగా సూసైడ్ చేసుకుంటామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. శనివారం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరిగే చోట పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ క్యాన్లు పట్టుకొని వచ్చి సూసైడ్చేసుకుంటామని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రీన్ బేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కంపెనీ జీరో పొల్యూషన్ ఉంటుందని చెప్పి జనాలను తప్పుదోవ పట్టించి ఫ్యాక్టరీ నిర్మిస్తుందని మండిపడ్డారు. దీనివల్ల గ్రామాల్లో దుర్వాసన వస్తుందని పంట పొలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.