
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కోతికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కోతి రోజూ తిరుగుతూ ఎవరైనా ఆహారం పెడితే తినేదని, ఎవరి నుంచి బలవంతంగా లాక్కునేది కాదని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం కోతి అకస్మాత్తుగా హనుమాన్ ఆలయంలో చనిపోయింది. విషయం గమనించిన సీతారామాంజనేయ స్వామి భజన మండలి సభ్యులు, గ్రామస్తులు మృతి చెందిన కోతిని ఆంజనేయస్వామికి ప్రతిరూపంగా భావించి గ్రామంలో మేళతాళాల మధ్య భజనలు చేస్తూ శవయాత్ర నిర్వహించారు.