ఈ టీచర్.. మాకొద్దు .. బదిలీ చేయాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు

ఈ టీచర్.. మాకొద్దు ..  బదిలీ చేయాలంటూ  నిరసన తెలిపిన విద్యార్థులు

గన్నేరువరం, వెలుగు :  విద్యార్థులను కొడుతూ.. స్టాఫ్ ను భయపెడుతున్న ఉపాధ్యాయుడు వద్దంటూ.. అతన్ని బదిలీ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ధర్నాకు దిగిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మండల పరిషత్ ప్రాథమిక ఉన్న త పాఠశాల  వద్ద శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. స్కూల్ కు చెందిన టీచర్  రామ్ రాజయ్య  విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాడని,  విద్యార్థులు అడిగితే  కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశా రు. మధ్యాహ్న భోజన సిబ్బందిని, హెచ్​ ఎంను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. 

ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాస్ ను వివరణ కోరగా.. రామ్ రాజయ్య తనకు రివాల్వర్ కావాలని కోరుతూ.. రివాల్వర్ ఫొటోతో పాటు అధికారులకు పెట్టుకున్న దరఖాస్తు, ఎంఈఓలు, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులపై చేసిన ఫిర్యాదులు, ప్రచురితమైన వార్తాపత్రికల కటింగ్స్ తనకు వాట్సప్ లో పంపించి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై టీచర్ రామ్ రాజయ్య స్పందిస్తూ.. పాఠశాల సిబ్బంది, హెచ్ఎం సరిగా పనిచేయడం లేదని అడిగినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని,  గతంలో ఇదే విధంగా ప్రశ్నిస్తే బదిలీ చేశారని పేర్కొన్నారు.