సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో సర్కార్ దవాఖాన ముందు బుధవారం వీడీసీ అధ్యక్షుడు దొడ్డె నరేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రావు మాట్లాడుతూ.. ఉత్తునూర్ సర్కార్ దవాఖానకు వైద్యురాలు రాకపోవడంతో రోగులు ఇబ్బందులుపడుతున్నారన్నారు. వ్యాధులబారిని పడిన రోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందక ప్రైవేట్దవాఖానకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు.
జిల్లా వైద్యాధికారి మరొక డాక్టర్ ను ఏర్పాటు చేయకుండా రోగుల ప్రాణాలతో చేలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజులలో డాక్టర్ ను నియమించాలని లేకుంటే జిల్లా వైద్యాధికారి ఆఫీస్ ముందు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోతే సాయవ్వ రాములు, నారాయణగౌడ్, వాగుమారి రాజేందర్, గుడ్ల భూంరావు, అరిగే గణేశ్, సాయిలు, నర్సయ్య, నరేశ్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.