బస్వాపూర్ కట్ట వెంట కరెంట్ టవర్లు .. సీపేజీలతో ప్రమాదం పొంచి ఉందంటున్న గ్రామస్తులు

బస్వాపూర్ కట్ట వెంట కరెంట్ టవర్లు .. సీపేజీలతో ప్రమాదం పొంచి ఉందంటున్న గ్రామస్తులు
  • ఇబ్బందేమీ లేదంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ కట్ట తవ్వి హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని, ఇది ఎంతో ప్రమాదకరమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పనులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన బాలస్వామి, నర్సింహ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్ వద్ద 11.39 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ నిర్మించారు. అయితే, నాడు రిజర్వాయర్​లో హైటెన్షన్ స్తంభాలు అడ్డుగా ఉండడంతో బండ్​కు అవతల వాటిని రీ లొకేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండ్​ను ఆనుకుని.. ఆ కట్టను తవ్వుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. 

14 కరెంట్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారని, కట్ట ధ్వంసం అవుతుండటంతో సీపేజీలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు లీక్ అవుతున్నా.. వాటిని భారీ మోటార్లతో ఎత్తిపోస్తూ పనులు కానిస్తున్నారని తెలిపారు. కట్ట బలహీనమై ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కట్టకు ప్రమాదం జరిగితే దిగువన ఉన్న గ్రామాలతో పాటు యాదగిరిగుట్ట ఆలయానికీ ముప్పు తప్పదని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి పనులు నిలిపేయాలని కోరారు. అయితే, దీనిపై ఇరిగేషన్‌‌శాఖ అధికారులను సంప్రదించగా పనులతో అలాంటి ఇబ్బంది ఏమీలేదని వివరణ ఇచ్చారు. కరెంట్ టవర్లు ఏర్పాటు చేశాక తిరిగి కట్టను యథావిధిగా చేస్తామని వెల్లడించారు.