- చదును చేసి, బోరు వేసేందుకు ఓ లీడర్ ప్లాన్
- ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ధారించాలని డిమాండ్
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ, ఐబీ ఆఫీసర్ల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుంటున్న అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన చెరువు భూములను సైతం ఆక్రమిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లోని గుడికంట చెరువుకు సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి ఆరు నెలల కిందే చెరువు భూమిలో మొరం పోయడంతో గ్రామస్తులు, రైతులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మళ్లీ ఇటీవల చెరువు భూమిలో బోరు వేసేందుకు ఏకంగా వెహికల్‌తో సహా రావడంతో రైతులు మరోసారి అడ్డుకున్నారు.
29 ఏళ్ల కిందట చెరువు నిర్మాణం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ హైదరాబాద్ – భూపాలపట్నం హైవేను ఆనుకొని గుడికంట చెరువు ఉంది. 29 ఏళ్ల కిందట ఈ చెరువు నిర్మాణ సమయంలో ప్రభుత్వ భూమితో పాటు గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు 28 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. దీంతో జవహర్ నగర్ నుంచి లింగాపూర్ వరకు 400 ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో తూము, మత్తడి, కాల్వలు నిర్మించారు. అయితే ఈ చెరువు హైవే పక్కన ఉండడం, సమీపంలో హరిత కాకతీయ హోటల్, టోల్‌గేట్ ఉండడంతో ఇక్కడ ఎకరా భూమి రూ. 5 కోట్ల వరకు పలుకుతోంది.
కబ్జా చేసేందుకు యత్నం... అడ్డుకున్న రైతులు
ధరణి వెబ్‌సైట్‌లో జరిగిన పొరపాటును ఆసరాగా చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ లీడర్ గుడికంట చెరువు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక్కడ ఉన్న 3 ఎకరాల భూమి తనదేనంటూ గతేడాది నవంబర్‌లో రాత్రికి రాత్రే మొరం, కంకర పోసి చదును చేసేందుకు యత్నించాడు. గమనించిన రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల కింద మరోసారి చెరువు వద్ద బోరు వేసేందుకు భూమి పూజ చేయడంతో పాటు, రాత్రికి రాత్రే బోరు వేసే ప్రయత్నం చేశాడు. దీంతో రైతులు మళ్లీ అడ్డుకున్నారు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ గుర్తించి హద్దురాళ్లు పాతాలని నవంబర్ 7న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు.
చెరువు నీళ్లే ఆధారం
ఈ చెరువు నీళ్లతో వందల ఎకరాల భూములు సాగవుతున్నాయి. చెరువు భూమిని కబ్జా చేస్తే రైతులు రోడ్డున పడాల్సి వస్తుంది. 6 నెలల కిందే చెరువు భూమిలో మట్టి పోస్తే అడ్డుకున్నాం. ఇప్పుడు ఏకంగా బోరు వేయడానికే సిద్ధమయ్యారు. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
–కుండె కొమురయ్య, రైతు, జవహర్‌నగర్
ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తాం
గుడికంట చెరువు భూమి కబ్జా అవుతుందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఎఫ్‌టీఎల్ నిర్ధారించి భూమి కబ్బా కాకుండా చర్యలు తీసుకుంటాం.
–ఐబీ డీఈ రవీందర్‌రెడ్డి