
సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ వద్ద రెండు గ్రామాల ప్రజల రాస్తారోకో
- రాజీవ్ రహదారిపై ట్రాఫిక్‌జామ్
బెజ్జంకి, వెలుగు : ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు బుధవారం బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇథనాల్ఫ్యాక్టరీ వల్ల పొలాలు నాశనమవుతాయని, వాతావరణం కలుషితమవుతుందని, ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు.
డిసెంబర్ 5న రెండు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన లెటర్‌ను హుస్నాబాద్ డీఎల్పీవో వీరభద్రయ్యకు ఇచ్చామని, ఆయన విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. కలెక్టర్వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమింపజేశారు.