- తహసీల్దార్‌కు గ్రామస్థుల వినతి
వేములవాడరూరల్, వెలుగు : తమ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని తహసీల్దార్ డి. సుజాతకు బొల్లారం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం-లింగంపల్లి గ్రామాల మధ్య గల వాగులో అధికారులు ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని కోరుతూ తహసీల్దార్‌కు శుక్రవారం విన్నవించారు.
ఇసుక రీచ్ తో తమకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వల్ల బొల్లారం గ్రామ చివర్లో ఉన్న ఇండ్లకు, హనుమాన్ ఆలయానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. సైడ్ వాల్స్ కట్టే వరకు ఇసుక తీసుకుపోవడానికి అనుమతించకూడదన్నారు. గతంలో కూడా చెక్ డ్యామ్ కూలిపోయి పంటలు, ఇండ్లు నష్టపోయామని గుర్తు చేశారు. వెంటనే ఇసుక తవ్వకాలను ఆపి వేయాలని వారు ఎమ్మార్వోను కోరారు.