
వెలుగు, చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు), జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టారు బాల్క సుమన్, ఆయన అనుచరులు. భూములు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జాబ్స్80 శాతం స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చి భూములను తీసుకున్నారు.
కానీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరులు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2లక్షలు తీసుకొని తమకు కావాల్సిన వాళ్లకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాన్ లోకల్స్‌కు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఉపాధి లేక ఉద్యోగాల కోసం సింగరేణి అధికారుల చుట్టూ, బాల్క సుమన్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని భూనిర్వాసిత కుటుంబాల యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంట పొలాలను ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులకు, పవర్ ప్లాంట్ కు తీసుకొని తమ బతుకులను ఆగం చేశారని ఆవేదన చెందుతున్నారు.
ఇచ్చింది నాలుగోవంతే.. అవీ కాంట్రాక్టే..
నిర్వాసితుల్లో నాలుగో వంతు మందికే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కొలువులు ఇచ్చారు. ఉదాహరణకు... ఎస్టీపీపీ ఏర్పాటు కోసం జైపూర్ మండలంలోని పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల పరిధిలో 1,883 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో జాబులు ఇస్తామని ఆశచూపారు. 825 భూనిర్వాసితుల కుటుంబాల్లో ఇంటికో పర్మినెంట్ జాబ్ ఇస్తామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. 80 శాతం కాంట్రాక్టు ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగ యువతకే ఇస్తామని చెప్పి, మొండిచేయి చూపారు.
ఎస్టీపీపీలో సుమారు 1600 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో భూనిర్వాసితులు, స్థానికులు కేవలం 400 మందే ఉన్నారు. మిగతా 1200 మంది ఉత్తరాది రాష్ర్టాలకు చెందినవారే. పలు కీలకమైన విభాగాల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతం వారే కావడంతో లోకల్ కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు.
కనీస వేతనాల చెల్లింపు, పని స్థలాల్లో భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్థానిక యువతకు డిగ్రీ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ అన్‌స్కిల్డ్ జాబ్స్‌కే పరిమితం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలతో పాటు వేతనాల చెల్లింపుల్లోనూ వివక్ష చూపుతున్నారు. అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.475, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.520 చొప్పున చెల్లిస్తున్నారు. ఐదేండ్ల సర్వీస్, విద్యార్హతలను బట్టి స్కిల్డ్ జాబ్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్యాయం చేస్తున్నారు.