కాగజ్ నగర్, వెలుగు : ఆదివాసీ గిరిజనుడు తను సాగు చేసుకుంటున్న భూమిలో బతుకుదెరువు కోసం చిన్న దుకాణం పెట్టుకున్నడు. నాలుగు రోజుల కిందట వచ్చిన గాలి దుమారంతో షెడ్డు గాలికి చెదిరింది. శనివారం సదరు రైతు అక్కడే మళ్లీ దాన్ని బాగు చేసేందుకు పాదులు తవ్వుతుండగా అటుగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ భూమిలో ఎలాంటి నిర్మాణం చేయొద్దని రైతును అడ్డుకున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం హేటిగూడ గ్రామానికి చెందిన తలండి లక్ష్మయ్యను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దయాకర్ కొట్టాడని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఎదుట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మయ్య మాట్లాడుతూ దుకాణానికి మరమ్మతులు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది ఫారెస్ట్ స్థలం, ఇక్కడ ఉండటానికి వీలులేదని దుకాణాన్ని కూల్చివేశారన్నారు. బెజ్జూర్ ఎఫ్ ఆర్వో దయాకర్ తనను చెంపపై కొట్టి, బూతులు తిట్టారని బాధితుడు వాపోయడు. కావాలనే ఫారెస్ట్ అధికారులు తనను వేధిస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దయాకర్ ను వివరణ కోరగా దుకాణం తీసేసిన మాట వాస్తవమే కానీ, ఎవరినీ కొట్టలేదని చెప్పారు.