- పోలీస్ పహారాలో తవ్వకాలు
- గ్రామస్తుల ఆందోళన బేఖాతర్
- బతుకుదెరువు కోల్పోతామంటున్న గ్రామస్తులు
మైలారం(నాగర్ కర్నూల్), వెలుగు : నల్లమల టైగర్ రిజర్వ్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్న మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆరేండ్లుగా ఆందోళన చేస్తున్నా, గుట్టను బద్దలు కొడుతున్నారు. మండల ఆఫీసులు, కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించి తమ నిరసన తెలిపినా మైనింగ్‌కు అడ్డుకట్టపడలేదు.
గతంలో మైలారం గ్రామానికి 50 మీటర్ల దూరంలో ఉన్న గుట్టపై మైనింగ్‌కు అనుమతులు తిరస్కరించిన ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మారిన నివేదికల ఆధారంగా ఆదేశాలను మార్చుకుంది. పోలీసుల పహారాలో గుట్టను తవ్వుతూ క్వార్డ్జ్, ఫెల్స్పర్ను తరలిస్తున్నారు. 400 ఇండ్లు,1500 జనాభా ఉన్న మైలారం గ్రామం మైనింగ్ దుమ్ములో కలిసిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుపై ఆధారపడిన మూడు గ్రామాలకు చెందిన 1,500 మంది మత్స్యకారుల కుటుంబాల జీవనాధారం పోతుందని, గుట్టపై ఆధారపడిన పశువులు, మేకలు, గొర్రెలకు పశుగ్రాసం ఎలాగని వాపోతున్నారు.
మైనింగ్ ఆఫీసర్ల మాయాజాలం..
2018లో మైలారం గుట్టపై సర్వే నెం.120/1లో 24.28 హెక్టార్లలో 20 ఏండ్ల పాటు క్వార్ట్జ్, ఫెల్స్పర్తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీనిపై గ్రామస్తులు తిరగబడి తవ్వకాలకు వచ్చిన మెషీన్లను అడ్డుకుని తిప్పి పంపించారు. రెండు సార్లు మైనింగ్ లీజ్ గడువును పొడిగించిన మైనింగ్ అధికారులు 2018లో గ్రామస్తుల అభ్యంతరాలపై నివేదిక ఇచ్చారు.
2021 మార్చి 27న నిర్వహించిన గ్రామసభలో మైలారం గుట్టపై మైనింగ్‌కు అభ్యంతరం లేదని తీర్మానం చేసినట్లు కాపీని జిల్లా మైనింగ్ అధికారులకు సమర్పించారు. దీంతో పాటు గుట్టపై మైనింగ్ చేయడం వల్ల అటవీ, పర్యావరణానికి, గ్రామం, చెరువుకు ఎటువంటి నష్టం జరగదని గంటల్లో నివేదిక తయారు చేసి పంపించారు. ఆ తరువాత గంటల వ్యవధిలో అనుమతులు ఇప్పించారు. గ్రామసభలో మైనింగ్‌పై చర్చ జరగలేదని, తీర్మానం చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన బల్మూరు పోలీసులు గంటల వ్యవధిలో జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఆఫీసులో, మైలారం గ్రామం, గుట్టపై ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. లైన్ క్లియర్ కాగానే మైనింగ్ లీజ్దారు భారీ మెషినరీతో గుట్టపై ఉన్న భారీ చెట్లను నరికేసి రోడ్లు ఏర్పాటు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల బహిష్కరణ..
ఆరేండ్లలో ఆరు సార్లు లీజ్దారుడిని అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగం మైలారంలో 893 మంది ఓటర్లు ఉంటే 10 లోపు ఓట్లేయించి పోలింగ్ సక్సెస్ అయిందని చెప్పుకున్నారు. పోలీస్ పహారాలో మైనింగ్ కొనసాగిస్తూ గుట్టపై శివాలయం, నర్సింహస్వామి దేవాలయాలు, గ్రామ దేవతల గుడులకు వెళ్లకుండా, పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
పౌర, మానవహక్కుల సంఘం నేతలు, పర్యావరణవేత్తలు గ్రామంలో పర్యటించి పరిస్థితులను చూడడంతో పాటు గ్రామస్తులతో మాట్లాడారు. అధికారులు తమకు సపోర్ట్ చేయడం లేదని అంటున్న గ్రామస్తులు హైకోర్ట్, ఎన్జీటీలో కేసులు వేయడానికి సిద్ధమవుతున్నారు.
మైనింగ్‌తో అన్నీ అనర్థాలే..
నల్లమలలోని టైగర్ రిజర్వ్‌కు 2 కిలోమీటర్ల దూరంలో బల్మూరు మండలం మైలారం గ్రామం ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది. గ్రామానికి, అడవికి మధ్య అడ్డంగా 50 మీటర్ల దూరంలో 115 ఎకరాల్లో విస్తరించిన పెద్ద గుట్ట ఉంది. పచ్చని చెట్లతో అడవి జంతువులు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులకు నిలయమైన ఈ గుట్టకు అవతలి వైపు చెరువు ఉంది. గుట్టపై పురాతన నర్సింహస్వామి, శివాలయం, గ్రామ దేవతల గుడులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్ నిర్మించారు. గుట్ట కింది భాగంలో పేదలు ఇండ్లు కట్టుకున్నారు.
మైలారం, బల్మూరు, కొండనాగుల గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపర్లు తమ జీవాలను ఇక్కడే మేపుకుంటారు. గుట్ట కింద ఉన్న చెరువు నుంచి మూడు ఊళ్లకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ చెరువుకు రక్షణగా ఉన్న గుట్టను ఆధారంగా చేసుకుని అప్పర్ ప్లాట్‌లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.4,500 కోట్లతో ఉమా మహేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రధాన రిజర్వాయర్‌ను ఇక్కడ కట్టేందుకు డీపీఆర్ రెడీ చేశారు. మైనింగ్‌తో మైలారం ఊరి ఆనవాళ్లతో పాటు మత్స్యకారులు, రైతులు, పశువుల కాపర్లు, పురాతన దేవాలయాలు
ఉమా మహేశ్వర లిఫ్ట్ కథ ఇక ఒడిసిపోయినట్లేనని అంటున్నారు. మైలారం గ్రామంలో జరుగుతున్న ఘటనలపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరిస్తుండగా.. గ్రామస్తులు దాటేస్తున్నారు. ఒక్క ఫోర్జరీ కాగితంతో అనుమతులు తెచ్చుకుని గుట్టను, ఊరిని, తమ బతుకులను నాశనం చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదన్న ఆగ్రహం, ఆక్రోశం వారి మాటల్లో కనిపిస్తోంది.