ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : కె.మదన్​మోహన్​రావు

  • యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా
  • పేదలకు ఇండ్లు కట్టిస్తా
  • బీఆర్ఎస్​లీడర్ల మాటలు నమ్మకండి
  • కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​రావు

లింగంపేట, వెలుగు : తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి కె.మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన లింగంపేట మండలంలోని మోతె, గాంధీనగర్, ఎల్లారం, ముస్తాపూర్, కొయ్యగుండు తండా, ఒంటర్ పల్లి, సురాయిపల్లి తండా, సురాయిపల్లి, జగదాంబతండా, కోమట్​పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట, ఐలాపూర్​ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్​ మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుతం ఏర్పడబోతుందని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ప్రతి కుటుంబానికి రూ.500లకే గ్యాస్​సిలిండర్, నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్​ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 నగదు పంపిణీ, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్​లను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలను కోరారు.

నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి కనిపిండం లేదని స్కూళ్లు శిథిలావస్థకు చేరాయని, మురుగునీరు రోడ్లపైనే పారుతుందన్నారు. సురేందర్​స్వగ్రామం నల్లమడుగులోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల సంక్షేమాన్ని మరిచిన బీఆర్ఎస్​ అభ్యర్థి జాజాల సురేందర్​ డిపాజిట్​ గల్లంతు చేయాలని కోరారు.

కాంగ్రెస్​ శ్రేణుల సత్తా ఏమిటో చూపాలి

కాంగ్రెస్ ​పార్టీ గుర్తుపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి, బీఆర్ఎస్​ తీర్థం పుచ్చుకున్న జాజాల సురేందర్ కు కాంగ్రెస్​ సత్తా ఏమిటో రుచి చూపించాలని మదన్​మోహన్​రావు కోరారు.రూపాయి,రూపాయి కూడగట్టుకొని చందాలు వేసి కాంగ్రెస్​ తరఫున సురేందర్​ను గెలిపిస్తే, డబ్బులకు ఆశపడి పార్టీ మారి పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బకొట్టారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి గంపగుత్తాగా ఓట్లేసి తనను గెలిపించాలని కోరారు.

తప్పుడు ప్రచారం చేసే నాయకుల తోలు తీస్తాకాంగ్రెస్​ పార్టీకి  ఓటేస్తే ఎవరికీ పింఛన్లు రావని బీఆర్ఎస్ లీడర్లు గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి తోలు ఒలుస్తామని మదన్​ హెచ్చరించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా చాలా మంది వృద్ధులు కాంగ్రెస్ ​పార్టీకి ఓటేస్తే పింఛన్లు,డబుల్​బెడ్​ రూమ్​ఇండ్లు రావని బీఆర్ఎస్ ​లీడర్లు చెప్పినట్లు తన దృష్టికి తెచ్చారన్నారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్​ లీడర్లు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను లోకల్​కాదని, ఎమ్మెల్యేగా గెలిస్తే అమెరికాకు వెళ్లిపోతానని కూడా ప్రచారం చేస్తున్నారన్నారు. అమెరికా వెళ్లాలనేది తన ఉద్దేశమయితే ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం తనకేముందన్నారు. 

ఉద్యోగ అవకాశాలు..

చేతిగుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ​అవకాశాలు కల్పిస్తానని మదన్​మోహన్​రావు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా ఎల్లారెడ్డి, కామారెడ్డిల్లో జాబ్​మేళాలు నిర్వహించి, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపినట్లు గుర్తుచేశారు. ఎల్లారెడ్డిలో జాబ్​మేళా ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్​ పోలీసులను పంపి అడ్డుకున్నారన్నారు.