వాగు అవతల అంబులెన్స్.. స్ట్రెచర్‌పై బాలిక మృతదేహాన్ని మోసుకెళ్లారు

వాగు దాటితేనే.. చావైనా.. బతుకైనా..

ఆదిలాబాద్ జిల్లా గుబిడి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులకు సాక్ష్యం ఈ ఫొటో. గ్రామానికి చెందిన చతుర్థి అనే బాలిక కొద్దిరోజులుగా హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడింది. రిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయింది.

అంత్యక్రియల కోసం గ్రామ శివారు వరకు అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇంటికి చేర్చే దారే కనిపించలేదు. ఎందుకంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఊరికి ఆనుకుని ఉన్న వాగు ఉప్పొంగింది. అంబులెన్స్ ను ఊళ్లోకి తీసుకెళ్లే దారిలేక.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నలుగురు గజ ఈతగాళ్లు శవం ఉన్న స్ట్రెచర్ ను ఇలా నీళ్లలో పైకి ఎత్తి వాగు దాటించారు. బాలిక మృతదేహాన్ని గ్రామానికి చేర్చారు.

ప్రతి వర్షా కాలంలో ఈ సమస్య ఎదురవుతున్నా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.