హైదరాబాద్, వెలుగు: ఈసారి పంచాయతీఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘కోతుల తిప్పలు’ తప్పేలా లేవు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడ్తామని, డ్రింకింగ్‌వాటర్ ఇస్తామని.. గతంలో ఓట్లు అడిగేవారు. జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు. కానీ ఈసారి గ్రామాల్లో సీన్మరోలా ఉంది. రోడ్లు, డ్రైనేజీల సంగతేమో గానీ.. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు. గ్రామాల్లో మనుషులపై దాడులు చేస్తూ, పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తూ నరకం చూపుతున్న కోతుల సమస్యను పరిష్కరించినవాళ్లనే సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా గెలిపిస్తామంటున్నారు. దీంతో పలువురు ఆశావహులు తమను గెలిపిస్తే కోతులన్నింటినీ పట్టించి అడవుల్లో వదలుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరైతే ఇప్పటికే రంగంలోకి దిగి కోతులను పట్టే పనిలో బిజీ అయ్యారు. ఇంకొందరు ఆశావహులైతే ఇప్పటికే కోతులను పట్టించి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. మొత్తమ్మీద ఈసారి కోతుల అంశం సర్పంచ్ఎన్నికల ఎజెండాగా మారడం విశేషం. గతంలోనూ ఇలా కోతుల బెడద నివారిస్తామని హామీ ఇచ్చినవాళ్లు భారీ మెజారిటీతో గెలుపొందారు.
కోతులను పట్టిస్తానంటే భారీ మెజారిటీతో గెలిపించిన్రు..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఏలేటి మమత.. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్రామంలో 4 వేల నుంచి 5 వేల కోతులు ఉండడంతో వాటి వల్ల ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్తున్న జనం.. మరో ఆలోచన లేకుండా మమతను భారీ మెజారిటీతో గెలిపించారు. సర్పంచ్ గా మమత గెలిచిన వెంటనే బిహార్ నుంచి ఓ స్పెషల్ టీమ్‌ను రప్పించి.. రెండు నెలలు కష్టపడి సుమారు 3 వేల కోతులను పట్టించి ఉట్నూరు అడవుల్లో వదిలివేశారు. గడిచిన రెండేళ్లలో కోతుల సంతతి భారీగా పెరగడంతో మళ్లీ అదే సమస్య మొదలైంది. దీంతో ఈసారి కూడా కోతులను పట్టించేవారికే ఓటు వేస్తామని జనం చెప్తున్నారు.
కోతులను తరిమినందుకు సర్పంచ్ పదవి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్.. కోతుల బెడద తీర్చేందుకు ఓ ఆలోచన చేశాడు. గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజొక వేషం వేసుకొని కోతులను తరమడం ప్రారంభించాడు. గ్రామంలో దాదాపు రూ.లక్ష వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్లను రప్పించాడు. వారం పాటు వారికి ఇక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకుని, అటవీ ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు. కోతుల బెడద తీర్చడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీలను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గ్రామస్తులు గెలిపించారు.