రా ష్ట్రంలో కోతుల బెడద రోజురోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి అవి ప్రవేశిస్తున్నాయి. పల్లెలను వాటి జీవన ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఆకలితో అలమటిస్తూ ఊర్లలో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. జనాల చేతుల్లో ఏదైనా కనిపిస్తే లాక్కునే సమయంలో వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. జనాలు బెంబేలెత్తుతున్నారు. పంట పొలాలకు, చేలకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రైతులు తమ పంటలను కాపు కాచుకోవల్సిన పరిస్థితులున్నాయి. పండ్ల తోటలనూ నాశనం చేస్తున్నాయి. కోతుల పట్ల ప్రజలకు ఉండే ఆధ్యాత్మిక భావన వల్ల వాటిని ఏమీ చేయలేకపోతున్నారు. గ్రామాల్లో కోతల బెడద ప్రజలకు నిత్యకృత్యంగా మారింది. గ్రామాల్లో ఇవాళ ఇదొక తీవ్రమైన సమస్యగా మారింది. అడవుల్లో కోతులకు సరైన ఆహారం దొరక్కపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొనడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో హరిత హారం పథకాన్ని ప్రారంభించినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోతులను అడవులకు పంపాలంటే చెట్లను పెంచాలన్నారు.
చెట్లు పెంచుతున్నా..
6 ఏండ్లుగా రాష్ట్రంలో హరితహారం పథకం అమలు చేస్తున్నారు కానీ కోతులు మాత్రం గ్రామాలను వదిలి అడవులకు పోవడం లేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గమనించి సమీక్షించాల్సిన అవసరం ఉంది. హరితహారం పథకంలో భాగంగా అడవుల్లో పండ్ల మొక్కలు నాటుతున్నారా, లేదా? ఆ విషయం ఎవరికీ తెలియదు. ఒకవేళ నాటినా వాటి సంరక్షణ చర్యలు ఏమేరకు తీసుకుంటున్నారో కూడా తెలియదు. అడవుల్లో పండ్ల మొక్కలు తప్పనిసరి పెంచాలి. కోతులకు కావల్సిన ఆహారానికి సంబంధించిన పండ్ల మొక్కలు నాటి పెంచాలి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి కోతులను పట్టి అడవుల్లో విడవాలి. స్థానికంగా ఆయా గ్రామపంచాయతీల పాలకవర్గం తక్షణ చర్యలు తీసుకోవాలి.
తలారి గణేష్